Chandrababu: అందరి అనుమానాలు పటాపంచలు చేసిన అమిత్ షాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
- ధర్మవరంలో ఎన్డీయే కూటమి సభ
- హాజరైన కేంద్రమంత్రి అమిత్ షా, చంద్రబాబు
- ధర్మవరం దద్దరిల్లిందన్న టీడీపీ అధినేత
- పొత్తు ఎందుకుని చాలామందికి అనుమానాలున్నాయని వెల్లడి
- అన్ని అనుమానాలకు అమిత్ షా స్పష్టమైన సమాధానం చెప్పారని వివరణ
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ధర్మవరంలో కేంద్రమంత్రి అమిత్ షాతో కలిసి కూటమి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రసంగం అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. ఇవాళ మూడు పార్టీలు కలిసి మీటింగ్ పెడితే ధర్మవరం దద్దరిల్లిందని అన్నారు. నడి ఎండల్లో మీటింగ్ పెట్టినా జనం పోటెత్తారని, జనాన్ని చూసి ఎండలు కూడా భయపడుతున్నాయని ఛమత్కరించారు. దేశంలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వం... మరోసారి మోదీనే ప్రధాని కాబోతున్నారు అని చంద్రబాబు వివరించారు.
"మేం చేస్తున్నది ధర్మపోరాటం... ధర్మాన్ని గెలిపించడానికి ప్రజలు సిద్ధం కావాలి. ఎందుకు మూడు పార్టీలు కలిశాయని చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఇవాళ అమిత్ షా వ్యాఖ్యలతో ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. పొత్తు ఎందుకున్న వారి ప్రశ్నకు అమిత్ షా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి... ప్రజలు గెలవాలి... దుర్మార్గుడ్ని ఇంటికి పంపించాలి అని అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే అమిత్ షాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
ఏపీ రాజధాని అమరావతిని నాశనం చేశాడు... మూడు ముక్కలాటతో ఏ రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ సైకో. కూటమి గెలిచాక అమరావతిని దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా చేసే బాధ్యత తీసుకుంటాం. అమరావతిని ప్రపంచపటంలో పెట్టే బాధ్యతను ఎన్డీయే తీసుకుంటుంది.
అమిత్ షా అమరావతికి కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. ఇప్పుడు అడుగుతున్నా సైకోని... ఇక ఏ ముఖం పెట్టుకుని తిరుగుతావ్? పోలవరంకు కట్టుబడి ఉన్నాం... పూర్తి చేస్తామని ప్రధాని మోదీ కూడా స్పష్టంగా చెప్పారు. అవినీతి వల్లే పోలవరం ఆలస్యం అయిందని అమిత్ షా కూడా చెప్పారు" అని చంద్రబాబు వివరించారు.
"పెన్షన్ల కోసం వృద్ధులను పొట్టనబెట్టుకుంటోందీ ప్రభుత్వం. మండుటెండలో సచివాలయాలకు రమ్మని పిలిచారు... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఈసీ సూచించింది. దాంతో బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ చేసి వృద్ధులను మళ్లీ ఇబ్బంది పెట్టారు. ఇలాంటి శవరాజకీయాలు చేసే ముఖ్యమంత్రిని ఇంటికి పంపాలి. కూటమి గెలిచి అధికారంలోకి వచ్చాక రూ.4 వేల పెన్షన్ ను ఏప్రిల్ నుంచే ఇస్తాం. దివ్యాంగులకు పింఛనును రూ.6 వేలకు పెంచుతాం. చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు ఇస్తాం.
గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడిన జగన్, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపాడు. ఈ ఎన్నికల్లో ఓటమి ఖాయమని జగన్ కు ముందే తెలుసు. ఓడిపోతానన్న భయంతోనే జగన్ కొత్త నాటకాలు ఆడుతున్నారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు లేవో జగన్ చెప్పాలి.
నాడు మేం ఉచితంగా ఇసుక ఇచ్చాం... ఇవాళ ఇసుక దొరికే పరిస్థితి లేకుండా చేశారు. మేం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానం తెస్తాం. రాయలసీమ లేపాక్షి భూములు కొట్టేయాలని చూశారు. ఇప్పుడు మన భూములపై మనకు హక్కు లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకు? మన భూమి మనం అమ్ముకోవాలన్నా జగన్ అనుమతి కావాలంట! జగన్ ను గద్దె దింపి, వైసీపీని భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు" అని చంద్రబాబు స్పష్టం చేశారు.