Sajjala Ramakrishna Reddy: అమిత్ షా వ్యాఖ్యలపై సజ్జల ఏమన్నారంటే...!

Sajjala reacts on Amit Shah remarks

  • ఇవాళ ధర్మవరం వచ్చిన అమిత్ షా
  • రామమందిరం ప్రారంభోత్సవానికి జగన్ ను పిలిచినా రాలేదని ఆరోపణ
  • అదేమైనా ప్రభుత్వ కార్యక్రమమా? అంటూ సజ్జల వ్యాఖ్యలు
  • రామమందిరానికి, ఏపీ ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? అని ప్రశ్న

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ధర్మవరం సభలో సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు  చేయడం తెలిసిందే. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి రావాలంటూ సీఎం జగన్ ను కూడా ఆహ్వానించామని, కానీ ఆయన రాలేదని అమిత్ షా ఆరోపించారు. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. 

"అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఏమైనా ప్రభుత్వ కార్యక్రమమా? దానికీ, ఏపీ ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? భారతదేశంలో ఎవరైనా అన్ని మతాలను గౌరవించాల్సిందే. ఓ మతంపై ఇష్టముంటే అది వ్యక్తిగతం వరకే పరిమితం కావాలి. కానీ అయోధ్యలో జరిగింది ప్రభుత్వ కార్యక్రమమో, అధికారిక కార్యక్రమమో కాదు కదా! 

ఇవాళ వచ్చి, వాళ్లకున్న ఉద్దేశాలను బయటపెట్టుకుని, దీని ద్వారా సందేశం పంపి నాలుగు ఓట్లు సంపాదించుకోవాలని చూస్తే అది వాళ్లకే తిప్పికొడుతుంది. అమిత్ షా అడిగినదానికి ఏమైనా అర్థం ఉందా? ఫలానా దగ్గరికి ఎందుకు పోలేదంటే ఏం చెబుతాం? 

హిందూమతంపై ఆధారపడిన ఆ పార్టీ వాళ్లే కొంతమంది ఆ కార్యక్రమానికి వెళ్లి ఉండకపోవచ్చు. రాష్ట్రం నుంచి ఇప్పటికీ చాలామంది అయోధ్య పోతుండొచ్చు... తిరుమలకు వెళ్లడం లేదా... ఇదీ అంతే! వీళ్లకు నచ్చినట్టుగా ప్రతి పౌరుడు తనను తాను నిరూపించుకోవాలి అంటే అది తప్పు" అని సజ్జల స్పష్టం చేశారు. 

బరితెగించిపోతున్నారు!

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుమారం కొనసాగుతోంది. దీనిపైనా సజ్జల రామకృష్ణారెడ్డి నేడు వివరణ ఇచ్చారు. ఇది భూములను కాపాడే చట్టం అయితే, ఈ చట్టంతో భూములు కోల్పోతారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విపక్ష నేతలపై మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ల్యాండ్ ప్రొటెక్టింగ్ యాక్ట్ అనదగ్గ ఈ చట్టాన్ని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని పిలిచేంతగా బరితెగించారని అన్నారు. ప్రజలు దీనిని గమనించాలని సజ్జల పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News