Chandrababu: జగన్ ది 'నార్సీ విధానం'... ఆ జబ్బు లక్షణాలు ఇలా ఉంటాయి: చంద్రబాబు

Chandrababu says Jagan is a narcissistic person

  • కర్నూలు జిల్లా పాణ్యంలో ప్రజాగళం సభ
  • ఈసారి రాయలసీమలో మనదే విజయం అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు
  • జగన్ మానసిక స్థితిని ఓ డాక్టర్ అధ్యయనం చేశాడని వెల్లడి

టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పాణ్యంలో నిర్వహించిన ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ... ఈసారి ప్రజాస్పందన చూస్తుంటే  పాణ్యంతో పాటు, రాయలసీమ కూడా మనదే అని ఖాయమైంది అని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రాయలసీమలోని 52 స్థానాల్లో 49 స్థానాలు సైకో గెలిచాడని వెల్లడించారు. ఇప్పుడు 49 కాదు... 52కి 52 మనవే అని ధీమా వ్యక్తం చేశారు. 

రాయలసీమలో మీరు మూడే గెలిచారని అతడు ఎగతాళి చేశాడు... దాంతో నాకు కూడా బాధ అనిపించింది... ఇన్ని పనులు చేసి కూడా ఓట్లు పడలేదు అని బాధపడ్డాను అని తెలిపారు. కానీ ఇప్పుడు పులివెందులలో కూడా జగన్ కు ఎదురుగాలి వీస్తోందని, అందుకే ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయాడని వ్యాఖ్యానించారు. 

"ఇప్పుడు ఏం చేస్తాడో నాకే తెలియదు... ఒకప్పుడు ఇంట్లో టీవీ పగలగొట్టేవాడు... ఇప్పుడు ఎంతమందిని లేపేస్తాడో అనిపిస్తోంది. సైకో జగన్ ను నమ్మినందుకు ప్రజలు మోసపోయారు. మరోసారి నమ్మడానికి జనాలు సిద్ధంగా లేరు. ప్రజల్లో ఒక కసి, ఆగ్రహం ఉన్నాయి. మే 13న పోలింగ్ బూత్ లో మీ కసి చూపించండి... వైసీపిని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయండి. 

అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి, గూండాగిరినీ అరికట్టడానికి, పోలవరం పూర్తి చేయడానికి, అమరావతిని కట్టి యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికే పొత్తు పెట్టుకున్నామని నిన్న అమిత్ షా కూడా స్పష్టం చేశారు. 

నిన్న మొన్న ఒక డాక్టర్... జగన్ మోహన్ రెడ్డి మానసిక స్థితిని అధ్యయనం చేశాడు. జగన్ పరిస్థితిని అధ్యయనం చేసిన డాక్టర్ చెప్పింది నార్సీ విధానం (నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్). 

నార్సీ విధానం అంటే... వాళ్లు చెప్పిందే చెబుతారు, వాళ్లు చేసేదే మనం చేయాలి, ఎదురు తిరిగితే దాడి చేస్తారు, చంపేస్తారు. చరిత్రలో నార్సీ విధానం అవలంబించిన వ్యక్తులను చూస్తే... మొట్టమొదటి వ్యక్తి హిట్లర్, రెండో వ్యక్తి బిన్ లాడెన్, మూడోది ఆఫ్ఘన్ తాలిబన్లు, నాలుగో వ్యక్తి ఉత్తర కొరియా అధినేత కిమ్... ఐదో వాడు ఈ కిమ్ తాత జిమ్!

చెప్పిన అబద్ధం చెప్పకుండా చెబుతాడు, అందరినీ మోసం చేస్తూనే ఉంటాడు... ఎదురుతిరిగితే నరికేస్తాడు... ఇతడికి తల్లి మీద ప్రేమ లేదు, మొన్నటివరకు ఆ తల్లి పార్టీ గౌరవాధ్యక్షురాలు... ఇప్పుడెక్కడుందా తల్లి? తల్లిని చూసుకోనివాడు ప్రజలను చూసుకుంటాడా? 

ఇక చెల్లెలు విషయానికొస్తే... ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలా, వద్దా? ఇచ్చాడా ఈ సైకో?... నార్సీ విధానం అంటే అదే. ఆ చెల్లెలు కూడా ఆయన దయాదాక్షిణ్యాలపై పడుండాలి... లేకపోతే కక్ష తీర్చుకుంటాడు. చెల్లెలి చీరల గురించి మాట్లాడుతున్నాడంటే... అదే నార్సీ విధానం!

ఇది మానసిక వైకల్యం! ఇలాంటి వాళ్లు తమ తండ్రిని కూడా ప్రేమించరు... వాళ్ల పిల్లలను కూడా ప్రేమించరు... తమను తాము కూడా ప్రేమించరు... తాము చెప్పింది జరగాలనేది వీళ్ల మనస్తత్వం! ఒక ఎంపీ తిరగబడ్డాడని అతడిపై సీఐడీ కేసులు పెట్టి, పోలీస్ కస్టడీలో అతడిని కొడుతుంటే తాడేపల్లి కొంప నుంచి చూసి భలే కొడుతున్నారు... ఇంకా కొట్టమని చెప్పాడంటే అతడి పరిస్థితి ఎలాంటిదో అర్థం చేసుకోండి. 

నంద్యాల జిల్లాలో నాపై ఏ కేసు లేదు. కానీ నడిరాత్రి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్నారు... ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి అన్నాను... మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేశామో చెబుతాం అన్నారు. నాకే దిక్కులేకపోతే ప్రజలకు దిక్కుందా? అర్థమైందా నార్సీ విధానం! 

బాబాయ్ ని గొడ్డలితో లేపేశాడంటే, గులకరాయి డ్రామా ఆడాడంటే, కోడికత్తి డ్రామా ఆడాడంటే, తండ్రి లేని బిడ్డను అని నాటకాలు ఆడాడంటే ఎలాంటివాడో అర్థం చేసుకోండి. అతడు తనను తాను దేవుడి కంటే గొప్పవాడు అనుకుంటాడు. పరిపాలించమని ఐదేళ్లు అధికారం ఇస్తే సెక్రటేరియేట్ కు వచ్చాడా? ఇది అహంకారం కాదా? నార్సీ విధానం కాకపోతే ఏంటిది? 

ఎన్నికల ముందు అమరావతి రాజధాని అన్నాడు... అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అని మూడు ముక్కలాటకు తెరలేపాడు... ఇది నార్సీ విధానం కాదా? సొంతపార్టీ ఎమ్మెల్యే, ఎంపీలకు అపాయింట్  మెంట్ ఇవ్వని వ్యక్తి ఇతను. 

ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు... అతడు వెళ్లే దారిలో చెట్లన్నీ నరికేశాడు... చివరికి అతడ్ని చూస్తే అతడికే భయం... చెట్టు చూస్తే భయం, పుట్ట చూస్తే భయం... ప్రజలను చూస్తే భయం! ఇప్పుడు పరదాలు తీసేసి ఓట్ల కోసం వస్తున్నాడు" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News