Pawan Kalyan: ఏపీ ప్రజల తరఫున మోదీకి చేతులెత్తి నమస్కరిస్తున్నా: పవన్ కల్యాణ్
- రాజమండ్రి సభలో పవన్ కల్యాణ్ ప్రసంగం
- ప్రధాని మోదీని వేనోళ్ల కొనియాడిన జనసేనాని
- ప్రధాని గొంతెత్తితే ప్రతి పౌరుడి అణువణువు కదిలిపోతుందనివ్యాఖ్యలు
- ప్రధాని ఎంతో పెద్దమనసుతో కూటమికి ఆశీస్సులు తెలిపారని వెల్లడి
రాజమండ్రి వద్ద వేమగిరిలో ఏర్పాటు చేసిన కూటమి సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీని వేనోళ్ల కీర్తించారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు.
భారతదేశానికి అభివృద్ధితో పాటు గుండె ధైర్యం కూడా కావాలి... శత్రుదేశాల మీద పోరాడగలిగే శక్తి, శత్రుసేనలు ముందుకొస్తే నిలువరించగలిగే శక్తి, కశ్మీర్ మనది కాదు అంటే, కాదు ఇది మనది అంటూ ఆర్టికల్ 370 రద్దు చేసిన బలమైన శక్తి... మన ప్రియతమ నాయకుడు మోదీ అని అభివర్ణించారు. ఉగ్రవాదులు భారత్ వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా చేసిన నేత మోదీ అని కీర్తించారు.
"శేషేంద్ర కవిత చదివినప్పుడల్లా నాకు మోదీ గారు గుర్తొస్తారు. సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు, పర్వతం ఎవడికీ వంగి సలాం చేయదు, తుపాను గొంతు చిత్తం మరణం ఎరుగదు, నేను ఇంతా కలిపి పిడికెడు మట్టి కావొచ్చు... కానీ గొంతెత్తితే భారతదేశపు మువ్వన్నెల జెండాకు ఉన్నంత పొగరుంది. ప్రధాని గొంతెత్తితే ప్రతి పౌరుడి అణువణువు కదిలిపోతుంది.
కేవలం సంక్షేమమే కాకుండా, అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమలు, సాగునీరు, తాగునీరు ఇవన్నీ అందిస్తున్న వ్యక్తి మన ప్రధాని మోదీ. కానీ కేంద్రం అందిస్తున్న ఈ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ పథకాలుగా చేసుకుంటోంది. కేంద్ర పథకాలకు తమ పేర్లు పెట్టుకుంటూ కూడా ఈ ప్రభుత్వం వాటిని సక్రమంగా అమలు చేయడంలేదు.
ప్రధాని మోదీ పాలనలో దేశమంతా అమృత ఘడియలు నడుస్తుంటే, ఏపీలో మాత్రం జగన్ పాలనలో విషపు ఘడియలు నడుస్తున్నాయి. ఏపీలో ఎటు చూసినా ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, ఎటు చూసినా స్కాములు... ఇవన్నీ ఆగాలంటే ప్రధాని నరేంద్ర మోదీ ముందుండి ఏపీని నడిపిస్తే తప్ప దీన్ని ముందుకు తీసుకెళ్లలేం. అందుకే ఆయన ఆశీస్సులు కోరుకున్నాం.
మేం ఎలాంటి స్వార్థానికి పోకుండా, వికసిత భారత్ కలలో ఐదు కోట్ల ఏపీ ప్రజలందరం కూడా మీ వెంట నడుస్తాం అని ఒక్క మాట అన్నందుకు, ఎంతో పెద్ద మనసుతో ప్రధాని మోదీ ఈ కూటమికి ఆశీస్సులు తెలిపారు. అందుకే ఏపీ ప్రజల తరఫున చేతులెత్తి మోదీ గారికి నమస్కరిస్తున్నాను.
నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక కళాకారులకు విలువ పెరిగింది. మోదీ పద్మ అవార్డులకు గౌరవం తీసుకువచ్చి నిజమైన మేధావులు, కళాకారులకు అవార్డులు వచ్చేలా చేశారు. తద్వారా ఆ అవార్డులకు గౌరవం తీసుకొచ్చారు.
ఈసారి 400 ఎంపీ సీట్లు సాధించాలన్నది మోదీ లక్ష్యం. అందుకు మా వంతుగా ఏపీ నుంచి పార్లమెంటు సభ్యులనే కాదు, మోదీ కల కోసం మా ప్రాణాలను కూడా అర్పిస్తాం" అంటూ పవన్ ప్రసంగించారు.