Renuka Chowdhury: ఢిల్లీ పోలీసులు ఏ అధికారంతో తెలంగాణలో దిగారు... తెలంగాణ తడాఖా చూపిస్తాం: రేణుకా చౌదరి హెచ్చరిక
- ఢిల్లీ పోలీసులు ఏ హక్కుతో గాంధీ భవన్‌కు వచ్చారని ప్రశ్న
- బీజేపీ వాళ్లకు దమ్ముంటే ప్రజ్వల్ రేవణ్ణని పట్టుకోవాలని సవాల్
- చాలామంది దొంగ సర్టిఫికెట్లతో పార్లమెంట్‌కు వస్తున్నారని చురక
ఢిల్లీ పోలీసులు ఏ అధికారంతో తెలంగాణలో దిగారని కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి ప్రశ్నించారు. వాళ్లు ఏ హక్కుతో గాంధీ భవన్‌కు వచ్చి తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేస్తే తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... నెహ్రూ, రాజీవ్ గాంధీ వంటి నేతలు ఇస్రో, ఇక్రిశాట్ నిర్మించారని... బీజేపీ మాత్రం ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తోందన్నారు.
రైతులను కారుతో తొక్కించిన కేంద్రమంత్రిపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపుల గురించి ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. అలాంటి వ్యక్తి కొడుక్కి బీజేపీ టిక్కెట్ ఇచ్చిందని విమర్శించారు. బీజేపీ వాళ్లకు దమ్ముంటే ప్రజ్వల్ రేవణ్ణని పట్టుకోవాలని సవాల్ విసిరారు. నీరవ్ మోదీ పారిపోయినట్లే రేవణ్ణ పారిపోయాడన్నారు. రేవణ్ణని బలపరిస్తే తనను బలపరిచినట్లేనని మోదీ నిస్సిగ్గుగా చెబుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు ఇంత చేస్తుంటే ఎన్నికల అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో ఉన్న ముస్లింలకు మోదీ ప్రధాని కాదా? అని ప్రశ్నించారు. ముస్లింల పట్ల బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. హిందూ ఆలయాలకు ఎందరో ముస్లింలు విరాళాలు ఇచ్చారని పేర్కొన్నారు. చైనా మన గడప తొక్కి ఇంట్లో ఉంటే మోదీ ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. చాలామంది దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని పార్లమెంట్‌కు వస్తున్నారని ఆరోపించారు. మోదీకి పెద్ద ఛాతి ఉండటం కాదు... అందులో గుండె, మనసు కూడా ఉండాలన్నారు.