Lok Sabha Polls: 93 స్థానాల్లో మొదలైన మూడో దశ లోక్‌సభ పోలింగ్

Voting in 93 Lok Sabha seats started as part in Lok Sabha Elections 2024

  • 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ షురూ
  • పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం
  • వేసవితాపం నేపథ్యంలో ఉదయం 7 గంటలకే పలు చోట్ల దర్శనమిస్తున్న భారీ క్యూ లైన్లు

లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా నేడు (మంగళవారం) మూడో దశ పోలింగ్ మొదలైంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 93 లోక్‌సభ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. వేసవితాపం నేపథ్యంలో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలి వెళ్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 93 స్థానాల్లోని 72 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఒక్క గుజరాత్‌లోనే ఆ పార్టీ 26 సీట్లను దక్కించుకుంది. 

మూడవ దశలో అసోం- 4 సీట్లు, బీహార్-5, ఛత్తీస్‌గఢ్ -7, గోవా-2, గుజరాత్-26, కర్ణాటక-14, మధ్యప్రదేశ్-8, మహారాష్ట్ర-11, ఉత్తరప్రదేశ్ -10, పశ్చిమ బెంగాల్-4, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ-2లలో పోలింగ్ జరుగుతోంది. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ లోక్‌సభ స్థానానికి కూడా పోలింగ్ మొదలైంది. రెండో దశలోనే ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి మరణించడంతో మూడో దశకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ దశలో మొత్తం 1,300 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో సుమారు 120 మంది మహిళలు ఉన్నారు.

ఓటు వేయనున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు (మంగళవారం) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. స్వరాష్ట్రమైన గుజరాత్‌లో వీరు ఓటు వేయనున్నారు. గాంధీనగర్ స్థానం పరిధిలోని అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ ఓటు వేయనున్నారు. ఇక ఇదే నియోజకవర్గ పరిధిలో కేంద్ర మంత్రి అమిత్‌ షా కూడా ఓటు వేయనున్నారు.

  • Loading...

More Telugu News