Postal Ballots: పోస్టల్ బ్యాలెట్లకు ఈ నెల 9 వరకు అవకాశం: ముఖేశ్ కుమార్ మీనా

Mukesh Kumar Meena says postal ballots extended till May 9
  • ఏపీలో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
  • మరో రోజు గడువు పెంచుతున్నట్టు ప్రకటించిన సీఈవో
  • 4.30 లక్షల పోస్టల్ బ్యాలెట్లలో 3.30 లక్షల బ్యాలెట్ల వినియోగం
  • ఒంగోలులో ఉద్యోగులు ప్రలోభాలకు గురైనట్టు తెలిసిందన్న మీనా
  • విచారణ జరుపుతామని వెల్లడి
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు ఆపేయాలని ఎన్నికల సంఘం చెప్పలేదని అన్నారు. కొంతకాలం తర్వాత ఇవ్వాలని ఈసీ స్పష్టం చేసిందని వివరించారు. 

ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగిస్తున్నట్టు వెల్లడించారు. మొత్తం 4.30 లక్షల పోస్టల్ బ్యాలెట్లలో 3.30 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్లు వినియోగించారని ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. 

కొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందని, సెక్యూరిటీ విధులకు వెళ్లిన వారికి ఈ నెల 9 వరకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సొంత సెగ్మెంట్లలోని ఫెసిలిటేషన్ సెంటర్లలోనూ పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చని స్పష్టత నిచ్చారు. 

ఒంగోలులో కొందరు ఉద్యోగులు ప్రలోభాలకు గురైనట్టు గుర్తించామని, కొందరు తమకు ఆఫర్ చేసిన మొత్తాన్ని తిప్పి పంపారన్న విషయం కూడా వెల్లడైందని వివరించారు. ఒంగోలులో ఆన్ లైన్ ద్వారా డబ్బులు పంపుతున్న వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు. 

పోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబుల్  ను సస్పెండ్ చేశామని సీఈవో ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. పల్నాడులో హోలోగ్రామ్ ద్వారా కూడా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, పల్నాడు ఘటనపైనా విచారణ చేపడుతున్నామని చెప్పారు. 

చిన్న మొత్తం కోసం ఆశపడితే ఉద్యోగానికే ప్రమాదం అని హెచ్చరించారు. డబ్బులు తీసుకున్న ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.
Postal Ballots
Mukesh Kumar Meena
AP CEO
General Elections-2024
Andhra Pradesh

More Telugu News