Devineni Uma: జగన్ దెబ్బకు రాష్ట్రంలో రైతు పరిస్థితి దయనీయం: దేవినేని ఉమా
- సాగునీరు ఇచ్చే దిక్కులేదని, పండిన పంట కొనుగోలు చేసే నాధుడు లేడన్న ఉమా
- అన్నదాతల కష్టాన్ని దళారుల పాలు చేశారంటూ ధ్వజం
- రైతు గెలిచి వ్యవసాయం నిలవాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలన్న ఉమా
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 'ఎక్స్' (ట్విటర్) వేదికగా విమర్శలు చేశారు. ఏపీలో జగన్ వల్ల రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ దెబ్బకు రైతు పరిస్థితి దయనీయంగా మారిందని దుయ్యబట్టారు. సాగునీరు ఇచ్చే దిక్కులేదని, పండిన పంట కొనుగోలు చేసే నాధుడు లేడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నదాతల కష్టాన్ని దళారుల పాలు చేశారంటూ టీడీపీ నేత ధ్వజమెత్తారు. ధరల స్థిరీకరణ నిధి, విపత్తుల నిధి ఏమయ్యాయి? అని నిలదీశారు. మోటార్లకు మీటర్లతో రైతుల మెడకు ఉరితాడు బిగించారని ఫైర్ అయ్యారు. జీరో వడ్డీ, డ్రిప్ ఇరిగేషన్, ఇన్పుట్ సబ్సిడీలకు మంగళం పాడారంటూ జగన్ సర్కార్‌పై దేవినేని దుమ్మెత్తిపోశారు. రైతు గెలిచి వ్యవసాయం నిలవాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు.