Chandrababu: స్కిల్ కేసు: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా
- స్కిల్ కేసులో చంద్రబాబుపై ఆరోపణలు
- అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
- చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
- హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ సర్కారు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్ ను వేసవి సెలవుల తర్వాత విచారిస్తామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ 10 వారాల తర్వాత ఉంటుందని న్యాయమూర్తులు వెల్లడించారు. సెలవుల తర్వాత కూడా వెంటనే విచారణ చేపట్టాల్సిన అవసరమేమీ లేదని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.
స్కిల్ కేసులో ఆరోపణల నేపథ్యంలో ఏపీ సీఐడీ అధికారులు గతేడాది టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ కేసులో ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
అయితే, ఏపీ హైకోర్టు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. ఇప్పటివరకు ఈ విచారణ పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తోంది.