Mayawati: మేనల్లుడిపై వేటు.. బీఎస్పీ చీఫ్ మాయావతి సంచలన నిర్ణయం

Mayawati Drops Nephew Akash Anand As Heir and From Party Post Till He Becomes

  • తన వారసుడిగా, బీఎస్పీ కోఆర్టినేటర్‌ పదవి నుంచి తాత్కాలికంగా తొలగింపు
  • పరిపక్వత సాధించే వరకు అతడిని బాధ్యతలకు దూరం పెడుతూ నిర్ణయం
  • బీజేపీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీఎస్పీ చీఫ్ మాయావతి నిర్ణయం

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌పై వేటు వేశారు. తన రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ సమన్వయకర్త పదవి నుంచి దూరంగా పెడుతున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆమె ఎక్స్ వేదికగా వెల్లడించారు. 29 ఏళ్ల ఆకాశ్ ఆనంద్ సంపూర్ణ పరిపక్వత చెందే వరకు అతడిని బాధ్యతలకు దూరం పెడుతున్నట్టుగా ఆమె స్పష్టం చేశారు.

 ‘‘ బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ పాటుపడ్డ అణగారిన వర్గాల ఆత్మగౌరవం, కాన్షీరామ్ కోరుకున్న సామాజిక మార్పులో బీఎస్పీ కూడా ఒక ఉద్యమం లాంటిది. అందుకోసం నేను నా జీవితమంతా అంకితం చేశాను. ఈ ఒరవడిని కొనసాగించడానికి నవతరం కూడా సిద్ధమవుతోంది’’ అంటూ ఎక్స్ వేదికగా మాయావతి స్పందించారు.

ఈ క్రమంలోనే పార్టీలో ఇతర వ్యక్తులను ప్రోత్సహించినట్టుగానే ఆకాశ్ ఆనంద్‌ను జాతీయ సమన్వయకర్తగా, నా వారసుడిగా ప్రకటించాను. అయితే పార్టీ, ఉద్యమ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా అతడిని ఈ రెండు ముఖ్యమైన బాధ్యతల నుంచి దూరం పెడుతున్నాను. సంపూర్ణ పరిపక్వత పొందే వరకు దూరంగా ఉంటాడు’’ అని రెండవ ట్వీట్‌లో ఆమె పేర్కొన్నారు. ఇక ఆకాశ్ ఆనంద్ తండ్రి ఆనంద్ కుమార్ పార్టీలో అతడి బాధ్యతలను కొనసాగిస్తారని మరో ట్వీట్‌లో మాయవతి స్పష్టం చేశారు.

కాగా ఇటీవలే బీజేపీని ఉద్దేశిస్తూ ఆకాశ్ ఆనంద్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉండడంతో పోలీసులు అతనిపై కేసు నమోదయింది. కేసు నమోదయిన కొన్ని రోజులకు మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వం బుల్‌డోజర్‌ గవర్నమెంట్ అని, దేశద్రోహుల ప్రభుత్వమని ఆకాశ్ ఆనంద్ ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. యువతను ఆకలితో వదిలి పెట్టి వృద్ధులను బానిసలుగా మార్చుకున్న ఉగ్రవాద ప్రభుత్వమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని తాలిబాన్‌తో పోల్చారు. దీంతో ఆయనపై కేసు నమోదయింది.

కాగా గతేడాది డిసెంబర్‌లో తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ని తన రాజకీయ వారసుడిగా మాయావతి ప్రకటించారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆకాశ్ ఆనంద్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంతకు ముందు అనేక బీఎస్పీ కార్యక్రమాలకు హాజరయినప్పటికీ 2019లో అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

  • Loading...

More Telugu News