False Rape Allegations: తప్పుడు అత్యాచారం కేసు పెట్టిన యువతికి 4 ఏళ్ల జైలు శిక్ష!
- యువకుడు అత్యాచారం చేశాడని ఆరోపించి మాట మార్చిన యువతి
- కోర్టు ఆగ్రహం, ఇలాంటి వారి వల్ల అసలైన బాధితులు ఇక్కట్లపాలవుతున్నారని వ్యాఖ్య
- అండర్ ట్రయల్ ఖైదీగా మారిన బాధితుడు ఆదాయాన్ని కోల్పోయాడన్న కోర్టు
- అతడికి పరిహారంగా రూ.5.88 లక్షలు చెల్లించాలని ఆదేశం
ఓ యువకుడిపై తప్పుడు అత్యాచారం కేసు పెట్టిన యువతికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ జిల్లా కోర్టు భారీ షాకిచ్చింది. చట్టాన్ని దుర్వినియోగ పరిచినందుకు యువతికి 4 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు, బాధితుడికి రూ.5.88 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. యువతి ఆరోపణల కారణంగా అండర్ ట్రయల్ ఖైదీగా మారిన యువకుడు తన ఆదాయాన్ని కోల్పోయినందుకు ఈ పరిహారం చెల్లించాలని పేర్కొంది.
కేసు వివరాల్లోకి వెళితే, 2019లో యువతికి 15 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లి ఈ కేసు దాఖలు చేసింది. యువతి, ఆమె సోదరితో కలిసి ఓ కంపెనీలో పనిచేస్తున్న అజయ్ అనే యువకుడు బాలికను కిడ్నాప్ చేశాడని ఆమె తల్లి ఆరోపించింది. తరచూ తమ ఇంటికొచ్చే అతడికి బాలికతో స్నేహం ఏర్పడిందని, దీన్ని అవకాశంగా తీసుకున్న అతడు ఆమెకు మత్తుమందు ఇచ్చి బలాత్కారం చేశాడని పేర్కొంది.
అయితే, విచారణ సందర్భంగా యువతి మాట మార్చింది. అజయ్ తనను కిడ్నాప్ చేయలేదని, బలాత్కరించలేదని పేర్కొంది. దీంతో, కోర్టు యువతిపై మండిపడింది. ‘‘ఇలాంటి వారి వల్ల అసలైన బాధితులు ఇక్కట్లపాలవుతున్నారు. సమాజంలో ఇదో ఆందోళనకర పరిస్థితి. తమ లక్ష్యాల కోసం పోలీసు, న్యాయవ్యవస్థలను దుర్వినియోగపర్చడం ఆమోదయోగ్యం కాదు. పురుషుల ప్రయోజనాలకు నష్టం కలిగించే అవకాశాన్ని మహిళలకు ఇవ్వకూడదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.