Sailaja: అన్నయ్య నాతో చెప్పిన మాట అదే: ఎస్పీ శైలజ
- గాయనిగా శైలజకి మంచిపేరు
- తల్లి ప్రోత్సాహం ఉండేదని వెల్లడి
- తనపై సుశీల ప్రభావం ఉందని వ్యాఖ్య
- సొంత స్టైల్ ఉండాలని అన్నయ్య చెప్పారని వివరణ
గాయనిగా ఎస్పీ శైలజకి మంచి గుర్తింపు ఉంది. బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె చాలా పాటలు పాడారు. ఐడ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో శైలజ తన కెరియర్ గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " మా ఇంట్లో మేమంతా పాడతాం. అయితే స్టేజ్ పై పాడటానికి నాన్నగారు ఒప్పుకునేవారు కాదు. అందువలన మా నాన్నగారికి తెలియకుండా మా అమ్మగారు పంపించేవారు" అని అన్నారు.
" మొదటి నుంచి కూడా నాపై సుశీల గారి ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆమె పాటలే ఎక్కువగా పాడేదానిని. "సుశీల గారిలా పాడటానికి ట్రై చేయవద్దు .. ఆమెను అనుకరించవద్దు .. ఆమె పాటలు పాడటానికి ఆమెనే ఉన్నారు కదా. మళ్లీ నువ్వు సుశీలగారి మాదిరిగా పాడటం వలన ఒరిగే ప్రయోజనం ఏముంటుంది? అని అన్నయ్య అనేవారు. సొంత గొంతుతో ప్రత్యేకతను తెచ్చుకోమని అనేవారు" అని చెప్పారు.
ఇక "సంగీత దర్శకులు పాటను కంపోజ్ చేస్తారు ... నువ్వేం చేస్తావ్' అని అన్నయ్య అడిగేవారు. పాటకి ఎక్స్ ప్రెషన్ ముఖ్యం .. మైక్ ముందు నువ్వు కూడా కొంచెం నటించాలి. అప్పుడే ఆర్టిస్టులు యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. పాటను ఎప్పుడూ కూడా ప్లాట్ గా పాడకూడదు" అని అనేవారు. అలా ఎప్పటికప్పుడు అన్నయ్య నుంచి అనేక విషయాలను నేర్చుకుంటూ ముందుకు వెళ్లాను' అని అన్నారు.