Fact Check: ఆ జనం తెలంగాణలో మోదీ రోడ్‌షోకు వచ్చినవారు కాదా?.. మరి నిజమేంటి?
- కొల్లాపూర్‌లో మోదీ రోడ్‌షోకు హాజరైన జనమంటూ ఫొటో వైరల్
- వారంతా దేశంపై ప్రేమతో, మోదీపై నమ్మకంతో వచ్చారని క్యాప్షన్
- కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా గుజరాత్లో నిరసన అంటూ గతంలో ఇదే ఫొటో వైరల్
- నిజానికి అది చైనాలోని గ్వాంగ్జౌలో ఒలింపిక్ టార్చ్‌కు సంబంధించిన ఫొటో
తెలంగాణలోని కొల్లాపూర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన రోడ్‌షోకు హాజరైన జనమంటూ వాట్సాప్‌లో ఇటీవల ఓ ఫొటో వైరల్ అయింది. అందులో ఇసుకేస్తే రాలనంతమంది జనం ఉన్నారు. వీరంతా డబ్బు, మద్యం పంచడం వల్ల రాలేదని, దేశం మీద ప్రేమ, మోదీ అభివృద్ధి మీద నమ్మకం ఉండడం వల్లే వీరంతా హాజరయ్యారంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. అయితే, ఈ ఫొటోపై ‘ఫ్యాక్ట్ చెక్’ చేయగా బోల్డన్ని ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి.
‘ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా గుజరాత్ ప్రజలు తెలుపుతున్న నిరసన’ అంటూ ఇదే ఫొటోను వాడుకున్నారు. నిజమేంటంటే.. ఈ ఫొటో మోదీ రోడ్‌షోదీ కాదు.. గుజరాత్లో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనకు సంబంధించినది కూడా కాదు. ఇదే ఫొటో 12 మే 2008లో ‘ఫ్లికర్’ వెబ్సైట్లో ప్రచురితమైంది. ఈ ఫొటో చైనాలోని గ్వాంగ్జౌలోనిది. చైనాలో నిర్వహించిన ఒలింపిక్ క్రీడల సందర్భంగా ఒలింపిక్ టార్చర్‌ను తీసుకెళ్తున్నప్పటి ఫొటో ఇది.