Komatireddy Venkat Reddy: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపుపై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
- ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్య
- ఏపీలో పార్టీ నష్టపోతుందని తెలిసినప్పటికీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్న మంత్రి
- దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయన్న కోమటిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఏపీలో పార్టీ నష్టపోతుందని తెలిసినప్పటికీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ కాస్త మెరుగుపడిందనే అభిప్రాయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కోమటిరెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో మాట్లాడారు.
క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలు
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయని... ఇలాంటి సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కోమటిరెడ్డి అన్నారు. రెండుసార్లు బ్లాక్ మనీని వెనక్కి తెస్తామని చెప్పిన మోదీ ఇప్పుడు రాముడి జపం చేస్తున్నారన్నారు. మోదీ పదేళ్ల పాలనలో దేశ సంపద అంబానీ, అదానీ చేతుల్లోకి వెళ్లిందని విమర్శించారు. ఓట్ల కోసమే బీజేపీ రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తోందన్నారు. మరోసారి మోదీ ప్రధాని అయితే ఎన్నికలు జరగకుండా శాశ్వత ప్రధానిగా ప్రకటించుకుంటారన్నారు.
మోదీ సహా బీజేపీ నేతలు చేస్తున్న ఆర్ఆర్ ట్యాక్స్ ఆరోపణలను ఖండించారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక్క టెండర్ కూడా పిలవలేదని, జీతాలు ఇవ్వలేనిస్థితి నుంచి ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని వెల్లడించారు. ఇవి మోదీకి కనిపించడం లేదా? అని నిలదీశారు. ఉత్తరాదిన బీజేపీపై వ్యతిరేకత వచ్చిందని, అందుకే దక్షిణాదిన సీట్ల కోసం మోదీ రాజకీయ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కేసీఆర్‌పై ఆగ్రహం
కేసీఆర్ అబద్ధాలు రామాయణం కంటే పెద్దదన్నారు. డిపాజిట్ల కోసమే కేసీఆర్ బస్సు యాత్ర చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మాట్లాడే భాషకు ఎన్నికల కమిషన్ రెండు రోజులు మాత్రమే కాదని... శాశ్వతంగా ఆంక్షలు విధించాలని వ్యాఖ్యానించారు.