RR Tax: తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ పేరిట ప్రజలను కాంగ్రెస్ దోచుకుంటోంది: ప్రధాని మోదీ
- మతాధారిత రిజర్వేషన్లకు అంబేద్కర్ వ్యతిరేకమన్న మోదీ
- ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను కాంగ్రెస్ తొలగించి ముస్లింలకు ఇవ్వాలనుకుంటోందన్న ప్రధాని
- తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఆగిపోయిందని చెప్పిన మోదీ
తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ పేరిట రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఆర్ ఆర్ లో ఒక ఆర్ అంటే రాహుల్ గాంధీ అని, రెండో ఆర్ రేవంత్ రెడ్డి అని మోదీ చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన వరంగల్ లో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రాన్ని లూటీ చేసిన సొమ్ము కొంత భాగం ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకులకు, మరికొంత హైదరాబాద్ కాంగ్రెస్ నాయకులకు వెళ్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాలు ఆ పార్టీకి ఏటీఎంలుగా మారిపోతాయని మోదీ చెప్పారు.
రాష్ట్రంలోని రైతులందరికీ సోనియాగాంధీ పుట్టినరోజునాటికల్లా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని ఆ హామీని ఇప్పటివరకు అమలు చేశారా అని ప్రశ్నించారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యాక రైతులకు రుణమాఫీ చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతోందని మోదీ విమర్శించారు. అదేవిధంగా మహిళలకు 2,500 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిందని ఇప్పటివరకు ఆ హామీని పట్టించుకున్న పాపానపోలేదని మోదీ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని, రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని మోదీ వివరించారు. ఈ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లిపోతున్నాయని ప్రశ్నించారు. ఇటీవలే ఝార్ఖండ్ లో ఓ కాంగ్రెస్ ఎంపీకి చెందిన కొన్ని వందల నోట్లకట్టలు బయటపడ్డాయని ఆ డబ్బులన్నీ ఎవరివని మోదీ ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతిని, నల్లధనాన్ని పూర్తిగా అరికట్టగలిగామని మోదీ చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ తనపై విమర్శలు చేస్తోందని ఆరోపించారు.
మతాధారిత రిజర్వేషన్లు ఇవ్వకూడదని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పారని కానీ, కాంగ్రెస్ కు రాజ్యాంగంపట్ల, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పట్ల ఏ విధమైన గౌరవం లేదని మోదీ ఆరోపించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లను కాంగ్రెస్ ఇవ్వడమే అందుకు నిదర్శనమన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను కాంగ్రెస్ తొలగించాలనుకుంటోందని, ఆ రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలనుకుంటోందని మోదీ ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2014లో దళితుడైన రామ్ నాథ్ కోవింద్ ను, 2019 లో ఆదివాసీ అయిన ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిగా చేసి ఆయా వర్గాలను గౌరవించామని మోదీ చెప్పారు.