Harish Rao: కాంగ్రెస్‌పై కోపంతో బీజేపీకి ఓటు వేస్తే అంతే సంగతులు: హరీశ్‌రావు
- కాంగ్రెస్ రివర్స్ గేర్ పాలనతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలయిందంటూ విమర్శ
- రిజర్వేషన్ల రద్దు పేరుతో కాంగ్రెస్, మతం పేరిట బీజేపీ నాటకాలు అడుతున్నాయన్న మాజీ మంత్రి
- కాంగ్రెస్, బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చాయని ధ్వజం
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు మరోసారి కాంగ్రెస్, బీజేపీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌పై కోపంతో బీజేపీకి ఓటు వేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టే అవుతుందన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ రివర్స్ గేర్ పాలనతో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిందని తెలిపారు. రిజర్వేషన్ల రద్దు పేరుతో కాంగ్రెస్, మతం పేరిట బీజేపీ నాటకాలు అడుతున్నాయని దుయ్యబట్టారు.
ఆరు గ్యారెంటీల అమలుపై రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి తలో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసిన గ్రామాల్లోనే ఓట్లు అడగాలని కాంగ్రెస్ నేతలకు హరీశ్‌రావు సవాల్ చేశారు. అటు ఫేక్ ప్రచారాలు చేయడంలో బీజేపి అభ్యర్థి దిట్ట అని, ఎట్టిపరిస్థితుల్లో వాటిని నమ్మవద్దు అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి చదువు తక్కువ, బీజేపీ అభ్యర్థిది బ్లాక్ మెయిల్ తత్వం అని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి దుబ్బాకలో చేసిందేమీ లేదన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు హరీశ్‌రావు గెలుపు అని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చాయని విమర్శించారు. ఊపిరి ఉన్నంత వరకు సిద్దిపేట కోసం పని చేస్తానని అన్నారు. సిద్దిపేట జిల్లా తీసేసే కుట్ర జరుగుతుందని ప్రాణం పోయినా జిల్లా తీసెయ్యనియ్యనన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివానుభవ మండపంలో బీఆర్ఎస్‌కు మద్ధతుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆర్ఎంపీ, పీఎంపీలతో నిర్వహించిన సమావేశంలో హరీశ్‌రావు ఇలా కాంగ్రెస్, బీజేపీలపై ధ్వజమెత్తారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నేతలు మారెడ్డి రవీందర్ రెడ్డి, దరిపల్లి శ్రీను, బచ్చు రమేశ్, రాజలింగం, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ హాజరయ్యారు.