KTR: అలా చేస్తే గుంపు మేస్త్రీ ఇంటికి వెళతారు: కేటీఆర్

KTR says Revanth Reddy will go to home if brs win 12 seats

  • 12 సీట్లలో గెలిస్తే కేసీఆర్ తిరిగి రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారన్న కేటీఆర్
  • పదేళ్లలో తెలంగాణకు మోదీ చేసిందేమీ లేదని విమర్శ
  • యాదాద్రి ఆలయాన్ని నిర్మించి రాజకీయాలకు వాడుకున్నామా? అని ప్రశ్న

ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 12 సీట్లు ఇస్తే గుంపు మేస్త్రీ ఇంటికి వెళతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అత్యధిక సీట్లు మనం గెలిస్తే ఆరు నెలల్లో కేసీఆర్ తిరిగి రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారన్నారు. కల్వకుర్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ... పదేళ్లలో తెలంగాణకు మోదీ చేసిందేమీ లేదని ఆరోపించారు. పేదలందరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి మోదీ మోసం చేశారన్నారు.

కృష్ణా జలాల్లో పదేళ్లుగా తెలంగాణ వాటాను కూడా మోదీ తేల్చలేదని విమర్శించారు. పాలమూరుకు జాతీయ హోదా అడిగితే ఇవ్వలేదన్నారు. ఏం అడిగినా బీజేపీ నేతలు అయోధ్యలో గుడి కట్టామని చెబుతుంటారని... కానీ కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని నిర్మించలేదా? దానిని ఎప్పుడైనా రాజకీయాలకు వాడుకున్నామా? అని నిలదీశారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడనుకున్నామని... కానీ కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తే మోసపోయారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. మోచేతికి బెల్లం కట్టి ఓట్లు వేయించుకున్నాక ప్రజల్ని పట్టించుకోవడం లేదన్నారు. పేగులు మెడలో వేసుకుంటానంటూ ముఖ్యమంత్రి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

రేవంత్ రెడ్డి అంటే రియ‌ల్ ఎస్టేట్.. రియ‌ల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి అని విమర్శించారు. క‌ల్వ‌కుర్తిలో రియ‌ల్ ఎస్టేట్ ఎందుకు పెరగలేదు? అని ప్రశ్నించారు. ప్ర‌భుత్వాన్ని నడపడం అంటే పాన్ డ‌బ్బా న‌డిపినంతా సులభం కాదన్నారు. నోటికొచ్చిన‌ట్టు, ఇష్ట‌మొచ్చిన‌ట్టు బూతులు మాట్లాడం కాదు... ప‌రిపాల‌న అంటే ద‌మ్ముండాలి... ద‌క్ష‌త ఉండాలన్నారు. అది ఉన్న నాయ‌కుడు కేసీఆర్ కాబ‌ట్టే రియ‌ల్ ఎస్టేట్ పెరిగిందన్నారు. భూముల ధ‌ర‌లు పెరిగాయి... ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయి.... నీళ్లు వ‌చ్చాయన్నారు.

  • Loading...

More Telugu News