JP Nadda: కాంగ్రెస్‌పై కర్ణాటక బీజేపీ పోస్ట్... జేపీ నడ్డా, అమిత్ మాలవీయకు సమన్ల జారీ
- ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బడుగువర్గాల రిజర్వేషన్లను గుంజుకునే ప్రయత్నాలని ఆరోపణ
- అందుకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్, మిత్రపక్షాలు చూస్తున్నాయన్న బీజేపీ
- పైవ్యాఖ్యలు ప్రతిబింబించేలా సోషల్ మీడియాలో బీజేపీ కర్ణాటక యూనిట్ పోస్ట్
ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బడుగువర్గాల రిజర్వేషన్లను గుంజుకునేలా రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు చూస్తున్నాయని బీజేపీ నేతలు విమర్శించారు. ఈ మాటలు ప్రతిబింబించేలా ఒక వీడియోను బీజేపీ కర్ణాటక యూనిట్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
ఈ సోషల్ మీడియా పోస్టుకు సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయకు కర్ణాటక పోలీసులు సమన్లు జారీ చేశారు. అలాగే బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో వారిపై ఎఫ్ఐఆర్ నమోదయింది. ఈ సమన్లలో భాగంగా వారు హాజరయ్యేందుకు అధికారులు వారం రోజుల గడువు ఇచ్చారు.
కర్ణాటక బీజేపీ పోస్ట్ చేసిన ఈ వీడియోను కాంగ్రెస్ ఖండించింది. దీనిని తొలగించాలని కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశించారు. ఈ వీడియోను తొలగించాలంటూ మంగళవారం ఎక్స్‌కు (ట్విట్టర్) నోటీసులు ఇచ్చారు.