Nara Rahith: మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది... కావలి నియోజకవర్గంలో నారా రోహిత్ ఎన్నికల ప్రచారం

Nara Rahith election campaign in Kavali constituency

  • నెల్లూరు జిల్లాలో నారా రోహిత్ పర్యటన
  • టీడీపీ అభ్యర్థులు కావ్య కృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తరఫున ప్రచారం
  • చంద్రబాబు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని వెల్లడి
  • ఐదేళ్ల అరాచక పాలనకు అంతం పలుకుదామని పిలుపు

వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఎన్డీయే కూటమికి మద్దతుగా రోహిత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన వైసీపీ పాలన ప్రతిపక్షాలు, ప్రజలపై అక్రమ కేసులు, అరాచకాలు దౌర్జన్యాలతో సాగిందని అన్నారు. ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసి 52 రోజులు జైల్లో ఉంచారని ఆరోపించారు. రూ. 5కే పేదవాడికి అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్ మూసివేసి పేదవారి నోటికాడ కూడుని తీసేశారని ధ్వజమెత్తారు. 

"రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన 74 మంది బీసీ సోదరులను వైసీపీ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది. బీసీ నాయకులైన అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడుపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. తెలుగుదేశం ప్రభుత్వం స్థానిక సంస్ధల ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్ 24 శాతానికి తగ్గించి రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావాల్సిన 16,800 పదవులకు వారిని దూరం చేశారు. 

టీడీపీ హయాంలో మైనార్టీల కోసం తెచ్చిన సంక్షేమ పధకాలన్నీ జగన్ రెడ్డి రద్దు చేసి వారికి అన్యాయం చేశారు. రంజాన్ తోఫా, దుల్హన్ పథకాలను రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. రైతులనూ ఇబ్బంది పెట్టారు. 

ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి అమ్మఒడి అమలు చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకరికే అంటూ మోసం చేశాడు. అధికారంలోకి వచ్చిన వారం రోజులలోనే సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులను నిలువునా మోసం చేశాడు.

రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి... రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే పరిశ్రమలు వస్తాయి. అప్పుచేసి పప్పుకూడు తినటం గొప్పకాదు. వైసీపీ ప్రభుత్వంలో లక్షల కోట్లు అప్పుగా తీసుకువచ్చారు. రాష్ట్ర పరిస్థితి ఇవాళ శ్రీలంకలా తయారవ్వటానికి కారణం జగన్మోహన్ రెడ్డి అసమర్ధ పాలనే. 

ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. అందరూ తప్పకుండా మే 13వ తేదీన సైకిల్ గుర్తుకు ఓటేయాలి. మీ భవిష్యత్తుకు మీరే దారి వేసుకోవాలి. తప్పకుండా ఓటేసి కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యా కృష్ణారెడ్డిని, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలి" అంటూ నారా రోహిత్ విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News