Daggubati Purandeswari: బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మండిపడ్డ పురందేశ్వరి
- ప్రధాని పదవికి మోదీ విలువ లేకుండా చేశారన్న బొత్స
- మోదీని విమర్శించే అర్హత బొత్సకు లేదన్న పురందేశ్వరి
- ఫోక్స్ వ్యాగన్ స్కామ్ ను ప్రజలు ఇంకా మర్చిపోలేదని వ్యాఖ్య
దేశంలో అతి పెద్ద అవినీతి పార్టీ బీజేపీ అని, ప్రధాని పదవికి మోదీ విలువ లేకుండా చేశారన్న మంత్రి బొత్స సత్యనారాయణపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మండిపడ్డారు. మోదీని విమర్శించే అర్హత బొత్సకు లేదని ఆమె అన్నారు. బొత్స వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని చెప్పారు. పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని అన్నారు. అవినీతిపరులకు లోకమంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని... మీరు చేసిన ఫోక్స్ వ్యాగన్ స్కామ్ ను ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పారు. విశాఖకు కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ను ఇస్తే... రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోలేకపోయిందని విమర్శించారు. పసలేని ఆరోపణలు చేయొద్దని బొత్సకు హితవు పలికారు.
అంతకు ముందు బొత్స మాట్లాడుతూ... తోడు దొంగలు ఇచ్చిన స్క్రిప్ట్ ను మోదీ చదివారని విమర్శించారు. నిజాలు పరిశీలించకుండా... ఏ స్క్రిప్ట్ ఇస్తే దాన్ని చదివేయడమేనా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల అవసరాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మోదీ ఎందుకు మాట్లాడలేదని అన్నారు. పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని గతంలో మోదీ అనలేదా? అని ప్రశ్నించారు. ఇంతగా దిగజారిపోయి మాట్లాడే ప్రధానిని తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రధాని మాట్లాడే మాటకు ఒక పవిత్రత ఉండాలని చెప్పారు.