zero shadow day: నేడు కాసేపు మీ నీడ మాయం!
- కర్కట రేఖ, మకర రేఖ మధ్యలోని ప్రాంతాల్లో అలరించనున్న జీరో షాడో డే
- సూర్య కిరణాలు నిటారుగా భూ ఉపరితలంపై పడటం వల్ల మాయమవనున్న నీడ
- హైదరాబాద్ లో మధ్యాహ్నం 12:12 నుంచి కొన్ని నిమిషాలపాటు అరుదైన దృశ్యం ఆవిష్కృతం
- ఏటా రెండుసార్లు సంభవించనున్న ఈ పరిణామం
సాధారణంగా ఎండ మనపై పడగానే పక్కనే మన ‘ప్రతిరూపం’ ప్రత్యక్షమవుతుంది. మన కదలికలకు అనుగుణంగా నీడ ఆకారంలో మనల్ని ఫాలో అవుతుంటుంది. కానీ ఈ రోజు సరిగ్గా మిట్టమధ్యాహ్న వేళ మాత్రం ఓ అద్భుతం జరగనుంది. కాసేపు మన నీడ మాయం కానుంది!
దీన్నే జీరో షాడో డే లేదా శూన్య నీడ దినం అని పిలుస్తారు. హైదరాబాద్ లో ఈ పరిణామం మధ్యాహ్నం 12:12 గంటలకు మొదలై రెండు, మూడు నిమిషాలపాటు కొనసాగనుంది. అలాగే బెంగళూరులో మధ్యాహ్నం 12:17 గంటల నుంచి 12:23 గంటల దాకా ఈ ప్రకృతి వింత కనిపించనుంది.
ఈ సమయంలో సూర్యుడు సరిగ్గా మన నడినెత్తిన ఉంటాడు. అంటే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ సూర్య కిరణాలు నిటారుగా భూమి ఉపరితలంపై పడతాయి. దీనివల్ల మనుషులతోపాటు జంతువులు, వస్తువులు సహా నిటారుగా ఉండే ఆకారాల నీడ మాయం కానుంది. కర్కట రేఖ (ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్), మకర రేఖ (ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్) మధ్య ఉండే ప్రాంతాల్లో ఏటా రెండుసార్లు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది.
ఈ అరుదైన దృశ్యాన్ని కలకాలం భద్రంగా ఉంచుకోవాలనుకొనే ఔత్సాహికులు వారి ఫొటోలను [email protected] కు పంపించాలని హైదరాబాద్ లోని బీఎం బిర్లా ప్లానిటోరియం ప్రతినిధులు సూచించారు. అయితే ఒకవేళ ఆకాశం మేఘావృతం అయినా లేదా వర్షం కురిసినా ఈ దృశ్యం కనిపించదని చెప్పారు.
మరోవైపు ఈ పరిణామం రెండు, మూడు రోజులపాటు కనిపిస్తుందని ప్లానెటరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ విభాగం అధ్యక్షుడు రఘునందన్ వెల్లడించారు.