Business News: చదరపు గజానికి రూ. 29 లక్షలా?.. అపార్ట్ మెంట్లు ఇంత రేటా?
- ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితా విడుదల చేసిన హెన్లీ సంస్థ
- ప్రపంచంలోనే ఖరీదైన సిటీగా నిలిచిన మొనాకో నగరం
- టాప్–20 నగరాల్లో నిలవని ఇండియాలోని నగరాలు
ఫ్లాట్ కొందామనుకుంటే.. మన దగ్గర ఎక్కడైనా, ఎంత ఖరీదైనా సరే మహా అయితే చదరపు గజానికి 10, 20 వేల రూపాయలు పలుకుతుంది. మరీ కాస్ట్లీ ఏరియాలు అయితే గజం 50 వేల రూపాయల దాకా కూడా ఉంటుంది. మరి ఒక్కో చదరపు గజానికి పది, ఇరవై లక్షలు చెల్లించాల్సి వస్తే.. వామ్మో అనిపిస్తోందా? ఈ లెక్క తేల్చేందుకే ప్రపంచ ప్రఖ్యాత హెన్లీ అండ్ పార్ట్ నర్స్ సంస్థ ఇటీవల ప్రపంచంలోనే ఖరీదైన నగరాల లిస్టును విడుదల చేసింది.
మూడు అంశాలు ప్రాతిపదికగా..
వివిధ దేశాల్లోని పెద్ద నగరాలను ఎంపిక చేసుకున్నారు. ఆయా నగరాల్లోని ప్రధాన ప్రాంతాలను.. ఆయా ఏరియాల్లో కనీసం 200 చదరపు మీటర్లకుపైన విస్తీర్ణం ఉన్న ఫ్లాట్ల రేట్లను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ వివరాలతో ఖరీదైన నగరాల లెక్కలు తీశారు. మరి ఏ దేశం ఏ స్థానంలో ఉంది.. అక్కడ చదరపు గజానికి రేట్లు ఎలా ఉన్నాయంటే..
- 1వ స్థానం – మొనాకోలోని మొనాకో సిటీలో రూ. 29 లక్షల 64 వేలు
- 2వ స్థానం – అమెరికాలోని న్యూయార్క్ సిటీలో రూ. 23 లక్షల 71 వేలు
- 3వ స్థానం – యూకేలోని లండన్లో రూ. 22 లక్షల 13 వేలు
- 4వ స్థానం – హాంకాంగ్ సిటీలో రూ. 21 లక్షల 54 వేలు
- 5వ స్థానం – ఫ్రాన్స్ లోని సెయింట్ జీన్ కేప్ ఫెరాట్లో రూ. 20 లక్షల 87 వేలు
- 6వ స్థానం – ఆస్ట్రేలియాలోని సిడ్నీలో రూ. 18 లక్షల 95 వేలు
- 7వ స్థానం – ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో రూ. 15 లక్షల 36 వేలు
- 8వ స్థానం – అమెరికాలోని లాస్ ఏంజిలిస్ లో రూ. 14 లక్షల 86 వేలు
- 9వ స్థానం – అమెరికాలోని పామ్ బీచ్ సిటీలో రూ. 14 లక్షల 61 వేలు
- 10వ స్థానం – అమెరికాలోని మియామీ బీచ్ లో రూ. 14 లక్షల 66 వేలు
వీటి తర్వాత స్థానాల్లో.. సింగపూర్, యూఎస్ఏలోని ది బే ఏరియా, ఫ్రాన్స్ లోని నైస్, స్విట్జర్లాండ్ లోని జెనీవా, ఫ్రాన్స్ లోని కేన్స్, సెయింట్ ట్రోపెజ్, యాంటిబ్స్, ఇటలీలోని పొర్టోఫినో, జపాన్ లోని టోక్యో, స్విట్జర్లాండ్ లుగానో.. సిటీలు నిలిచాయి. వీటన్నింటిలోనూ చదరపు గజానికి రూ.12 లక్షలు పైనే ఉండటం గమనార్హం.