Nara Lokesh: నా తెల్లగడ్డం చూసి ముసలోడ్ని అనుకోవద్దమ్మా!: నారా లోకేశ్
- మంగళగిరిలో నారా లోకేశ్ 'రచ్చబండ'
- హాజరైన నారా భువనేశ్వరి
- వైసీపీ మాయ మాటలు నమ్మొద్దని ప్రజలకు లోకేశ్ విజ్ఞప్తి
- టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని విన్నపం
- మరో 40 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని వెల్లడి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో నేడు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నారా లోకేశ్ ప్రసంగిస్తూ, వైసీపీ మాయ మాటలు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన భవిష్యత్తు కాదు... మన పిల్లల భవిష్యత్తు ఓటుపై ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. ఏదో డబ్బులు ఇస్తున్నారని ఒక్కసారి ఏమరుపాటుగా ఉంటే నష్టపోయేది ప్రజలేనని అన్నారు. ఈ ప్రభుత్వ పాలన కారణంగా ఇప్పటివరకు దాదాపు 4 సంవత్సరాల 11 నెలలు ఇబ్బంది పడ్డామని తెలిపారు.
"ఇంకెన్నాళ్లని ఇబ్బంది పడతాం? అప్పుడు ఒక్క అవకాశం అన్నాడు. అందరికీ ముద్దులు పెట్టాడు. ఇప్పుడు అందరినీ గుద్దుతున్నాడు. దయచేసి ఆ మాయ మాటలు విశ్వసించవద్దు. వారిచ్చే డబ్బులను కూడా నమ్ముద్దు... తీసుకోండి... ఓటు మాత్రం టీడీపీకే వేయండి. నేనొక యువకుడ్ని, ఉత్సాహవంతుడ్ని... మంగళగిరి నియోజకవర్గంలో పనిచేయడానికి వచ్చాను. నా తెల్లగడ్డం చూసి ముసలోడ్ని అనుకోవద్దమ్మా! కరకట్ట కమలహాసన్ లా రంగేయడం తెలీదు తల్లీ నాకు! పనిచేయడానికి వచ్చాను, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చాను.
ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. భారతదేశ రాజకీయాల్లో ఇంకో 40 ఏళ్ల పాటు నేను ఉంటాను. నేను ప్రజలకు సేవ చేయడానికే వచ్చాను తప్ప, ప్రజలతో మాట పడేందుకు రాలేదు. మళ్లీ ఐదేళ్ల తర్వాత ఇలాగే రచ్చబండ పెడతా... శభాష్, బాగా చేశావు అని మీతోనే అనిపించుకుంటా" అంటూ నారా లోకేశ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో మాట్లాడారు.