Virat Kohli: సెంచరీ మిస్ చేసుకున్న కోహ్లీ... ఆర్సీబీ భారీ స్కోరు
- ధర్మశాలలో ఆర్సీబీ × పంజాబ్ కింగ్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 241 పరుగులు చేసిన ఆర్సీబీ
- 47 బంతుల్లో 92 పరుగులు చేసిన కోహ్లీ
- రజత్ పాటిదార్ మెరుపు ఇన్నింగ్స్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ తాజా సీజన్ కాస్త ఆలస్యంగా ఫామ్ లోకి వచ్చింది. అయితేనేం, అదరగొట్టే ఆటతో దూసుకుపోతోంది. ఇవాళ ఆర్సీబీ... పంజాబ్ కింగ్స్ తో తలపడుతోంది.
ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 241 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ విధ్వంసక ఆటతీరుతో కదం తొక్కడం ఈ ఇన్నింగ్స్ లో హైలైట్ గా నిలిచింది.
కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (9) త్వరగానే అవుటైనప్పటికీ, కోహ్లీ పరుగుల బీభత్సం సృష్టించాడు. మొత్తం 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు. సెంచరీకి 8 పరుగుల దూరంలో అర్షదీప్ సింగ్ బౌలింగ్ లో అవుటయ్యాడు.
మరో ఎండ్ లో రజత్ పాటిదార్ మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. పాటిదార్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 46 పరుగులు సాధించాడు. ఆఖర్లో దినేశ్ కార్తీక్ 7 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్ లు బాది 18 పరుగులు చేశాడు.
పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, విద్వత్ కావేరప్ప 2, అర్షదీప్ సింగ్ 1, కెప్టెన్ శామ్ కరన్ 1 వికెట్ తీశారు.
ఇక 242 పరుగుల భారీ లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ ఆరంభంలోనే వికెట్ చేజార్చుకుంది. 6 పరుగులు చేసిన ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ తొలి ఓవర్లోనే అవుటయ్యాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 2 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. బెయిర్ స్టో (6 బ్యాటింగ్), రిలీ రూసో (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.