CM Jagan: మంగళగిరిలో జగన్ రోడ్ షో.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ పాత రోజులే వస్తాయన్న సీఎం
- ఇప్పుడున్న పథకాలు కొనసాగాలంటే జగన్‌కు ఓటు వేయాలని వ్యాఖ్య
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండంటూ ప్రజలకు పిలుపు
- చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమేనని ఎద్దేవా
- గత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వం తమదేనన్న జగన్
- 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని వెల్లడి
ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. మంగళగిరి పాత బస్టాండ్ ప్రాంతంలో నిర్వహించిన ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మరో మూడు రోజుల్లో కురుక్షేత్రం జరగనుంది. ఐదేళ్ల భవిష్యత్ ను, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగిసిపోతాయని, జగన్‌కు ఓటు వేస్తే ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయన్నారు.
చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమేనని జగన్ ఎద్దేవా చేశారు. సాధ్యం కాని హామీలను గుప్పించి మోసం చేస్తున్నారని, ప్రతిఒక్కరూ ఈ విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల దీవెనలతో తన 59 నెలల పాలనలో గతంలో ఎన్నడూ చూడని మార్పులు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. రూ. 2.70 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి, నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వం తమదేనని అన్నారు.
'8వ తరగతి నుంచే విద్యార్థులకు ట్యాబ్ లు అందించాం. గోరుముద్ద, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేశాం. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇచ్చాం. ఐదేళ్లలో లంచాలు, వివక్షలేకుండా పాలన అందించాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా పాలన సాగించామని జగన్ అన్నారు. అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్, ఇంటి వద్దకే పౌర సేవలు.. ఇలా ఇంటికే వచ్చే పాలనగానీ, పథకాలుగానీ గతంలో ఎప్పుడైనా చూశారా?' అని ప్రశ్నించారు.
అలాగే అన్నదాతల సంక్షేమం కోసం చేపట్టిన రైతుభరోసా, పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ వంటి వాటిని కూడా ప్రస్తావించారు. నాడు-నేడు పేరిట ఇంగ్లీష్ మీడియం బడులు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనతో విద్యార్థులు గొప్పగా చదువుతున్నారని వెల్లడించారు. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, డిజిటల్ లైబ్రరరీ, అక్కచెల్లెమ్మల కోసం దిశ యాప్ ఇలా గతంలో లేని ఎన్నో మంచి కార్యక్రమాలను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.
ఆటోలు, ట్యాక్సీలు నడుపుతున్న డ్రైవర్ల కోసం వాహన మిత్ర, నేతన్నల కోసం నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, లాయర్లకు లా నేస్తం ఇలా ప్రతిఒక్కరికీ ఏదో ఒక పథకం తీసుకొచ్చి ఆదుకున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగిన దాఖలాలు లేవన్నారు.
14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఒక్క మంచి పనైనా చేశారా? చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? అని జగన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన ఈ పాంప్‌లెంట్ (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ) చూస్తే అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. అందులో పేర్కొన్న హామీలను ఈ సందర్భంగా జగన్ చదివి వినిపించారు. ఇందులో ఒక్క హామీ కూడా చంద్రబాబు నెరవేర్చలేదని దుయ్యబట్టారు.
'మంగళగిరి సీటు బీసీల సీటు. వెనుకబడిన వర్గాలవారు ఈ నియోకవర్గంలో అధికంగా ఉన్నారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆర్‌కేను కాదని ఈసారి ఈ నియోజకవర్గం నుంచి బీసీ మహిళకు ఇచ్చాం' అన్నారు. కానీ, టీడీపీ నుంచి ఏకంగా పెద్దపెద్దోళ్లు వచ్చి డబ్బుల మూటలతో ఎన్నికల్లో గెలవటానికి చూస్తున్నారు. వారి వద్ద డబ్బులు తీసుకొని వైసీపీకి ఓటు వేయండి. ఎందుకంటే చంద్రబాబు ఎన్నికల్లో పంచే డబ్బు పేదల నుంచి దోచుకున్నదేనని జగన్ అన్నారు. మళ్లీ ఇప్పుడు పొరపాటున ఆయనకు ఓటు వేస్తే అప్పటి పరిస్థితినే వస్తుందని, జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని సీఎం జగన్ కోరారు.