Errabelli Dayakar: వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు నాకు రూ.100 కోట్లు ఆఫర్ చేశారు: ఎర్రబెల్లి దయాకర్

I was offered Rs 100 crore when YSR was CM said Errabelli Dayakar

  • అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేదన్న మాజీ మంత్రి
  • పార్టీ మారకపోవడంతో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఎస్సీగా రిజర్వ్ చేశారని ఆరోపణ
  • ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తన శిష్యుడేనని వ్యాఖ్య
  • ఏడాదిలోపే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పిన ఎర్రబెల్లి

దివంగత రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌లోకి రావాలంటూ తనకు రూ. 100 కోట్లు ఆఫర్ చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంత్రి పదవి కూడా ఇస్తానని అన్నప్పటికీ తాను హస్తం పార్టీలోకి వెళ్లలేదని పేర్కొన్నారు. తాను పార్టీ మారకపోవడంతో రాజశేఖర్ రెడ్డి వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారని ఆరోపించారు. వర్ధన్నపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. తదుపరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం జనరల్ కాబోతోందని, మళ్లీ తానే గెలుస్తానని జోస్యం చెప్పారు. వర్ధన్నపేట నియోజకవర్గం దయన్న అడ్డా.. ఇకపై ఇక్కడే ఉంటానని అన్నారు. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి ఏడవటంతో సానుభూతి ఏర్పడిందని, అందుకు ఓటర్లు ఆమెను గెలిపించారని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.

రేవంత్ నా శిష్యుడే: ఎర్రబెల్లి
రేవంత్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయితే తాను ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన శిష్యుడేనని, ఎప్పుడూ స్థిరంగా ఉండని వ్యక్తి అని విమర్శించారు. ఇక తాను ఎప్పుడూ చంద్రబాబును, ఎన్టీఆర్‌ను తిట్టలేదని చెప్పారు ఎర్రబెల్లి. తెలంగాణలో ఏడాది లోపు అసెంబ్లీ ఎన్నికలు రావడం ఖాయమని దయాకర్ రావు జోస్యం చెప్పారు. ఇక కడియం శ్రీహరి పెద్ద మోసకారి అని విమర్శించారు. చంద్రబాబును, కేసీఆర్‌ను సైతం ఆయన మోసం చేశారని అన్నారు. 

కార్యకర్తల జోలికొస్తే ఊరుకోబోం..
కాంగ్రెస్ శ్రేణులు.. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే వదిలిపెట్టబోమని ఎర్రబెల్లి అన్నారు. కాంగ్రెస్ లీడర్లు బెదిరిస్తే భయపడే స్థితిలో లేమని పేర్కొన్నారు ఒక్కరి జోలికి వచ్చినా వంద మందిని ఉరికిస్తామని హెచ్చరించారు. అధికారంలో లేకపోయినా కార్యకర్తలను కాపాడుకున్నానని, ఇప్పుడు కూడా కార్యకర్తలపై ఈగ వాలినా సహించబోనని అన్నారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు ఒక పదవి ఇస్తానంటున్నారని, ఆ విషయంపై ఆలోచిస్తున్నానని ఎర్రబెల్లి వెల్లడించారు.

  • Loading...

More Telugu News