Chandrababu: వరుణ దేవుడు కూడా కరుణించాడు... అనుమానం లేదు... విజయం మనదే!: గన్నవరంలో చంద్రబాబు
- గన్నవరంలో ప్రజాగళం సభ
- భోరున వర్షంలోనూ సభకు భారీగా తరలివచ్చిన జనాలు
- చంద్రబాబు కూడా వర్షంలోనే ప్రసంగించిన వైనం
టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు హాజరయ్యారు. చంద్రబాబు రాకకు ముందు నుంచే గన్నవరంలో భారీ వర్షం పడుతోంది. చంద్రబాబు వేదికపై గొడుగు కింద నిలుచున్నప్పటికీ తడిసి ముద్దయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ, మే నెలలో గన్నవరంలో వర్షం పడుతోందంటే వరుణ దేవుడు కూడా కరుణించాడని అర్థమని అన్నారు. అనుమానమే లేదు... విజయం మనదే అని ధీమా వ్యక్తం చేశారు.
"కాబోయే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి... వర్షంలో తడుస్తూ నాకు స్వాగతం పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రత్యేకించి మా తెలుగింటి ఆడబిడ్డలకు నమస్కారాలు. వరుణ దేవుడు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా, ఎండలను లెక్కచేయకుండా గెలుపు ధ్యేయంగా పనిచేస్తున్న మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటాను.
మరో మూడ్రోజుల్లో ఎన్నికలు అయిపోతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ లో ఒక సైకో ఉన్నాడు, గన్నవరంలో ఒక పిల్ల సైకో ఉన్నాడు... ఖబడ్దార్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడుండే వాడు తిన్నంటి వాసాలు లెక్కబెట్టేవాడు. ఇప్పటివరకు నా మర్యాదనే చూశారు... భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ రౌడీలను తుంగలో తొక్కేయకపోతే చూడండి!
యార్లగడ్డ వెంకట్రావు చదువుకున్న వ్యక్తి. రాజకీయాలను ఆధారంగా చేసుకోలేదు. అమెరికా వెళ్లి తెలివితేటలతో డబ్బులు సంపాదించిన వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు. ఇక్కడ ఉండే సైకో రౌడీయిజం చేసి, భూ కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వ్యక్తి. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, పిల్లల భవిష్యత్తు వెలగాలన్న ఆశయంతోనే నేను, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పనిచేస్తున్నాం.
ఎక్కడికి వెళ్లినా కూటమిపై అభిమానం ఉద్ధృతంగా ఉంది. ఏమీ అనుమానం లేదు, వైసీపీకి డిపాజిట్లు కూడా రావు. చరిత్రలో మీరు చూడని విధంగా సైకో ఓడిపోబోతున్నాడు. నవరత్నాలు అన్నాడు... అవి నవమోసాలా, కాదా? అందుకే మనం సూపర్ సిక్స్ ఇచ్చాం... ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం. మన మేనిఫెస్టో ముందు వైసీపీ మేనిఫెస్టో వెలవెలపోయింది. మన మేనిఫెస్టో కళకళలాడుతోంది. కూటమి పట్ల ప్రజల్లో ఆశలు పెరిగాయి... ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతాం. సర్వజనుల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం... అదే మాదిరిగా ఎన్డీయే కూటమి.
ఇవాళ వర్షం రాకపోతే గన్నవరం దద్దరిల్లిపోయేది. వర్షం వచ్చినా లెక్కచేయకుండా ప్రజలు మీటింగ్ కు వచ్చారంటే ఇది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. శాశ్వతంగా గుండెల్లో పెట్టుకుంటాను.
గన్నవరం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఓ ఇండిపెండెంట్ తో కలిపి తొమ్మిదిసార్లు ఇక్కడ గెలిచింది మనమే. ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గెలుపును గోడ మీద రాసేసుకున్నాం. పిల్ల సైకో ఓడిపోవడం ఖాయం. ఎగిరెగిరి పడ్డావు... నా దగ్గర తోక జాడిస్తే తోక కట్ చేస్తాను తప్ప ఎవరినీ వదిలిపెట్టను. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ను తగలబెట్టినప్పుడు వీరోచితంగా పోరాడిన నా తెలుగు తమ్ముళ్లను ఎప్పటికీ మర్చిపోలేను.
పోలవరం కాలువలు నేను తవ్వితే, ఆ కాలువల్లో మట్టి దొంగిలించిన దొంగలను ఏమనాలి? ఈ అనకొండలు కొండలను కూడా తవ్వేశారు. భూ కబ్జాలు జరిగాయా, లేదా? ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాలపై కూడా జగన్ రెడ్డి గారి ఫొటో అంట. భూమి మీదా, జగన్ మోహన్ రెడ్డిదా? మీ భూమిపై ఆయన ఫొటో ఏంటి? ఎవరిచ్చారు ఈ భూమి? జలగ ఇచ్చాడా ఈ భూమి? మీ తాత ఇచ్చాడు, మీ తండ్రి ఇచ్చాడు... వారసత్వంగా వచ్చింది. దీన్ని చించేసి చెత్తబుట్టలో వేయాలి. నేను వస్తూనే దీన్ని రద్దు చేస్తా... పట్టాదారు పాస్ పుస్తకంపై రాజముద్ర వేసి మళ్లీ మీకిస్తా.
రెండోది.. కొత్త చట్టం తీసుకువచ్చాడు. వీళ్లబ్బ సొత్తు మాదిరిగా... మీ భూమి మీది కాకుండా పోతుంది... జలగ జగన్ ది అవుతుంది. అమెరికాలోని బే ఏరియాలో బినామీ పేరుతో ఓ కంపెనీ పెట్టాడు. మీ రికార్డులన్నీ అందులో పెడతాడంట. మీకు జిరాక్స్ కాపీ ఇస్తాడంట. ఆ జిరాక్స్ కాపీ దేనికీ పనికిరాదు. ఆ రికార్డులు చూసుకునేందుకు ఓ గుమస్తాను పెడతాడంట. గుమస్తా సజ్జల మాట్లాడుతున్నాడు... మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటున్నాడు. నువ్వెవరయ్యా... మా ఆస్తిపై నీ పెత్తనం ఏంటి?
ఆస్తులు కొట్టేయడానికి ఇది కొత్త మార్గం! టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లంట... వాళ్లను జగన్ మోహన్ రెడ్డి నామినేట్ చేస్తాడంట. రిజిస్ట్రేషన్ లో ఆయన చెప్పిందే ఫైనల్ అంట... ఆ తర్వాత కోర్టుకు వెళ్లే వీలు కూడా లేదంట! దీనికి జగన్ సమాధానం చెప్పాలి... టైటిలింగ్ రిజిస్ట్రేషన్ కు ప్రైవేట్ వ్యక్తులను పెట్టావా, లేదా? మన ఆస్తులను కాపాడేది ప్రైవేటు వ్యక్తులా?
అన్ని డాక్యుమెంట్లు ఉంటేనే భూమికి గ్యారెంటీ ఉండడంలేదు. ఇప్పుడు ఎమ్మార్వో ఉండడంట, ఆర్డీవో ఉండడంట, ఈయన నామినేట్ చేసిన వ్యక్తి మన ఆస్తిపై పెత్తనం చేస్తాడంట. తల్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి... ఎన్నికల్లో ఫ్యాన్ తిరిగితే మీ మెడకు ఉరే! మీరు ఎన్నికల్లో ఫ్యాన్ కు ఉరేస్తే మీ ఆస్తి పదిలం. అందుకే ఈ చట్టాన్ని మేం రాగానే రద్దు చేస్తాం, ముక్కలుముక్కలు చేసి చెత్తబుట్టలో పడేస్తాం.
ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి... సమయం లేదు మిత్రమా... చాలా తక్కువ సమయం ఉంది... రేపు సాయంత్రం 4 గంటలకు అన్ని బూత్ ల్లో ప్రజలందరూ వచ్చి ఈ చట్టాన్ని మేం ఆమోదించబోమని చించి చెత్తబుట్టలో పారేయండి. మీ ఆస్తులకు భద్రత రావాలంటే పోలింగ్ రోజున ఉదయం ఏడుగంటలకే బూత్ ల వద్దకు వచ్చేయండి.
నిన్న పోస్టల్ బ్యాలెట్ సందర్భంగా ఉద్యోగులను చూశారు. మా పోలీసులు కూడా నిన్న బ్రహ్మాండంగా ఓటేశారు. నూటికి 90 మంది మనకే అనుకూలంగా ఓటేశారు. వన్ సైడ్ ఓట్లు పడ్డాయి... దీన్ని బట్టే ట్రెండ్ అర్థమైపోతోంది. రేపు ఊళ్లకు ఊళ్లు ఒక్కటవుతాయి. నీ అవినీతి డబ్బు మాకు అక్కర్లేదని ఉద్యోగులు చెప్పేశారు. మన వద్దకు వచ్చిన ఉద్యోగులు మనకే ఐదు వేలు, పదివేలు ఇచ్చారంటే పరిస్థితి ఎంత అనుకూలంగా మారిపోయిందో చూడండి" అంటూ చంద్రబాబు ప్రసంగించారు.