Chandrababu: రేపే ఎన్నికల ప్రచారానికి చివరి రోజు... ఎక్కడికి వెళ్లినా స్పందన అదిరిపోయింది: ఒంగోలులో చంద్రబాబు
- ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో చంద్రబాబు ప్రజాగళం సభ
- చంద్రబాబు రోడ్ షోకు విశేష స్పందన
- ప్రజాగళం పరంపరలో ఒంగోలు సభ 87వ సభ అని చంద్రబాబు వెల్లడి
- మరో రెండ్రోజుల్లో మార్పు తెచ్చే రోజు వస్తోందని ధీమా
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో భారీ రోడ్ షో, ప్రజాగళం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... రేపే ఎన్నికల ప్రచారానికి చివరి రోజు... అందుకు ఒక రోజు ముందుగా ఒంగోలు వచ్చాను... ఆశీర్వదించమని అడగడానికి వచ్చాను అన్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే గెలిపిస్తామని గట్టిగా చెప్పే పరిస్థితికి వచ్చారు అని వ్యాఖ్యానించారు.
"ప్రజాగళం పరంపరలో ఇది 87వ సభ. రాష్ట్రమంతా తిరిగాను. ఎక్కడ చూసినా ఇదే స్పందన. మరో రెండ్రోజులు పోతే పోలింగ్ డే (మే 13). ప్రజల్లో చైతన్యం రావాలి. గడచిన ఐదేళ్లలో మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మీ ఆదాయాలు ఏమైనా పెరిగాయా? మీ ఖర్చులు తగ్గాయా? జీవన ప్రమాణాలు పెరిగాయా? ఈ దుర్మార్గుడు ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చాడు. ముద్దులు పెట్టాడు... గెలిచిన తర్వాత బాదుడే బాదుడు... గుద్దుడే గుద్దుడు! అతడి దాడి నుంచి ఎవరైనా తప్పించుకోగలిగారా?
కూల్చివేతలు, దాడులు, అక్రమ కేసులు, సెటిల్మెంట్లు... నా జీవితంలో ఈ అరాచకాలు ఎప్పుడూ చూడలేదు. ఇతడు మామూలు సైకో కాదు... ఒక అహంకారి, ఒక విధ్వంసకారి. ఎవరైనా పరిపాలన ఒక మంచి పనితో ప్రారంభిస్తారు. నేను కట్టిన ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి, ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి అన్నాడు. ప్రజావేదికను కూల్చుతున్నాను అని చెప్పి కూల్చిన వ్యక్తి ఈ సైకో. అక్కడ్నించి ఎప్పుడైనా ఒక్క మంచి పని చేశాడా?
ఈ ప్రభుత్వం వల్ల అన్ని విషయాల్లో నష్టపోయాం. కరెంటు చార్జీలు ఎనిమిదిసార్లు పెంచాడా, లేదా? రూ.200 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు రూ.1000 వస్తోంది. నేను అధికారంలో ఉన్నప్పుడు కరెంటు చార్జీలు పెంచానా? ఎప్పుడైనా కరెంటు కోత విధించానా? ఇక్కడ మందుబాబులు ఉన్నారు... సాయంత్రం అయితే ఓ పెగ్గు వేసుకోవాలి, మళ్లీ తెల్లారేసరికి చార్జింగ్ అయి పనికిపోవాలి. మీ బలహీనత జగ్గూ భాయ్ కి అర్థమైపోయింది. అందుకే జే బ్రాండ్లు తీసుకువచ్చాడు.
ఇక్కడ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా దశాబ్దాలుగా మద్యం వ్యాపారంలో ఉన్నారు. ఆయన కూడా ఇలాంటి బ్రాండ్లు చూడలేదు. కానీ ఇతడు ఎప్పుడూ వినని కొత్త బ్రాండ్లు తీసుకువచ్చాడు. మద్యం అమ్మకాల్లో ఆన్ లైన్ పేమెంట్లు ఉన్నాయా? ఏమిటి రహస్యం? వచ్చిన ఆదాయంలో సగం తాడేపల్లి కొంపకు పోవాలి.
మద్యపాన నిషేధం తీసుకువస్తానని చెప్పాడా, లేదా? నిషేధం తీసుకురాకపోతే ఓటు అడగనని చెప్పాడా, లేదా? ఇప్పడు బుద్ధి, సిగ్గు లేకుండా వచ్చి ఓటు అడుగుతున్నాడా, లేదా? పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపీ నెంబర్ వన్ గా ఉందా, లేదా? దీనివల్ల నిత్యావసర ధరలన్నీ పెరిగిపోయాయి.
పోలీసులు మొన్నటి వరకు శుక్రవారం అయితే ఇళ్లలోకి గోడలు దూకి వచ్చేవారు. వారు ఇప్పుడు మారిపోయారు. ఉద్యోగస్తులు నిన్ననే విశ్వరూపం చూపించారు. ఒక్కరు కూడా జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేయలేదు. ఇది ఒక విప్లవం. డబ్బులు ఇచ్చినా... నీ పాపిష్టి డబ్బులు మాకు వద్దు అని ఉద్యోగస్తులు, పోలీసులు చెప్పారు... చాలా సంతోషం... ఉద్యోగులందరికీ న్యాయం చేస్తాం.
ఇప్పుడిప్పుడే చూస్తున్నా... తిరుగుబాటు ప్రారంభమైంది. ఇవాళ, రేపు ఉద్ధృతమవుతుంది... 13వ తేదీన పోలింగ్ స్టేషన్ లో పతాకస్థాయికి చేరుతుంది. ఇవాళ ఎక్కడ ఎంతో మంది యువత ఉంది. ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? డీఎస్సీ అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా?
ఒక్కసారి పవన్ కల్యాణ్ ను గుర్తుచేసుకోవాలి. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా నిజమైన హీరో. ఒక సిద్ధాంతం కోసం కట్టుబడిన వ్యక్తి, ప్రజల కోసం నిలబడే వ్యక్తి. పవన్ కల్యాణ్ ను అనేకసార్లు అవమానించారు. ఒకసారి... నా భార్యల గురించి మాట్లాడుతున్నావు జగన్... నువ్వు కూడా రా... నీతో కూడా కాపురం చేస్తానని పవన్ కల్యాణ్ అన్నాడు. సిగ్గున్నోడు అయితే మళ్లీ మాట్లాడడు. సొంత చెల్లెల్ని కూడా తిట్టేవాడ్ని ఏమంటారు? ఇలాంటి వ్యక్తుల వల్ల ఆడవాళ్లకేమైనా రక్షణ ఉంటుందా?
హైదరాబాద్ ను అభివృద్ధి చేశాను, ఐటీ రంగాన్ని ప్రోత్సహించాను. నన్ను అరెస్ట్ చేసినప్పుడు 80 దేశాల్లో 53 రోజుల పాటు పోరాటం చేశారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను.
ఇప్పుడు ఎన్నికల కోసం 2,500కి పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు వచ్చి పని చేస్తున్నారు. ఇక్కడే ప్రొఫెషనల్స్ ఉన్నారు... దేశంలో ఎక్కడెక్కడో పనిచేస్తున్నా, ఇవాళ వాళ్లు కూడా అందరూ వచ్చారు. నిరుద్యోగులు కూడా మా కోసం పనిచేస్తున్నారు. ఒక నాయకుడు చేసిన పనుల వల్ల మేం కూడా బాగుపడ్డాం... మేం మీతోనే ఉంటాం అని చెబితే ఆ నాయకుడికి అంతకంటే కావాల్సింది ఏముంటుంది?
ఇవాళ ఏపీ అనాథలా మారిపోయింది. ఈ జలగ జగన్ వల్ల 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాం. నేను బ్రహ్మాండంగా డ్రైవింగ్ చేస్తానంటే, మీరు కూడా ఇతడు కూడా పోటుగాడేమో అనుకున్నారు. కానీ అతడు రివర్స్ డ్రైవింగ్ తో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు.
నేను సమైక్యాంధ్ర సీఎంగా ఉన్నప్పుడు తిరుపతి ప్రాంతంలో ఒక సైకో 30 మందిని చంపేశాడు. అతడు కేవలం ఒంటరి ఆడవాళ్లనే చంపేసేవాడు. వారి నుంచి ఏమీ తీసుకునేవాడు కాదు. ఫోరెన్సిక్ ఆధారాలు కూడా సేకరించి పరిశీలించాం. అతడి జీవితంలో ఏం జరిగిందో తెలియదు కానీ కేవలం ఆడవాళ్లనే చంపేసేవాడు.
ఇప్పుడున్న సైకో కూడా అలాంటివాడే. చెప్పిందే చెబుతుంటాడు... వినకపోతే కొట్టి మరీ వినిపిస్తాడు... మళ్లీ సాక్షి పేపర్ పెట్టుకున్నాడు. ఇలాంటి వాడ్ని ఎప్పుడూ చూడలేదు. మే 13తో అరాచకాలకు, దుర్మార్గ పాలనకు అంతం పలకాలి... స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలకాలి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు.