Chennai Super Kings: గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ‘ప్లే ఆఫ్స్’ సమీకరణాలు ఇవే
- ప్రస్తుతం 6 విజయాలతో 4వ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ సేన
- మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తేనే అవకాశాలు
- కీలకమవనున్న ఇతర జట్ల ఫలితాలు
ఐపీఎల్ 2024లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగింపు దశకు చేరుకోవడంతో ప్లే ఆఫ్స్‌కు చేరుకోబోయే జట్లు ఏవి అనేది ఆసక్తికరంగా మారింది. చెరో 8 విజయాలతో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌కు ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారవ్వగా మిగతా రెండు స్థానాల విషయంలో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. మ్యాచ్ ఫలితాలను బట్టి సమీకరణాలు మారిపోతున్నాయి. ఇక గత రాత్రి (శుక్రవారం) గుజరాత్ టైటాన్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 35 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్టయింది.
ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 6 విజయాలతో ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతోంది. దీంతో మిగిలిన చివరి రెండు మ్యాచ్‌లను ఆ జట్టు తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. అంతేకాదు ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. మరోవైపు చెన్నైపై విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు 5 విజయాలను నమోదు చేసింది. దీంతో ఆ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. అయితే గుజరాత్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం చాలా సంక్లిష్టమనే చెప్పాలి. ఎందుకంటే 14 పాయింట్లతో మాత్రమే ఆ జట్టు అర్హత సాధించే అవకాశం ఉంది. అలా జరగాలంటే మిగిలివున్న మ్యాచ్‌ల్లో గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలు కూడా గుజరాత్ టైటాన్స్‌కు అనుకూలంగా రావాల్సి ఉంటుంది.