Jeevan Reddy: టీఎస్ఆర్‌టీసీ ఎండీపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు!
- టీఎస్ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్‌పై ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ఫిర్యాదు
- ఆర్మూర్‌లో తన మాల్ తాలూకు రూ. 7.50 కోట్లు ఇప్పటికే చెల్లించినప్పటికీ బకాయిలు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
- కావాలనే పోలీసులు, ఆర్‌టీసీ అధికారులను మాల్‌కు పంపించి తమను బద్నాం చేయిస్తున్నారని మండిపాటు
- సజ్జనార్ సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్న సమయంలోనే రూ. వేల కోట్ల ఆస్తులు సంపాదించారన్న జీవన్ రెడ్డి
- సజ్జనార్ సీఎం రేవంత్‌రెడ్డి కనుసన్నల్లో పని చేస్తున్నారని దుయ్యబట్టిన బీఆర్ఎస్ నేత
టీఎస్ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్‌పై ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి రాష్ట్ర, కేంద్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆర్మూర్‌లో తన మాల్‌కు సంబంధించి రూ. 7.50 కోట్లు ఇప్పటికే చెల్లించినప్పటికీ బకాయిలు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కావాలనే పోలీసులు, ఆర్‌టీసీ అధికారులను మాల్‌కు పంపించి తమను బద్నాం చేయిస్తున్నారని మండిపడ్డారు.
తమ వద్ద ట్యాక్సులు వసూలు చేసి కేంద్రానికి జీఎస్‌టీ చెల్లించకుండా సజ్జనార్ స్కామ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. టైర్లు, డీజిల్, స్క్రాప్, కొత్త బస్సుల కొనుగోళ్ల పేరుతో ఆయన కమీషన్లు వసూలు చేస్తున్నారని తెలిపారు. సజ్జనార్ సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్న సమయంలోనే రూ. వేల కోట్ల ఆస్తులు సంపాదించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కనుసన్నల్లో పని చేస్తున్నారని దుయ్యబట్టారు.
వెంటనే విచారణ చేసి సజ్జనార్‌ను సస్పెండ్ చేయాలని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. టీఎస్ఆర్‌టీసీ ఎండీపై ఫిర్యాదు నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా, నగర మేయర్ నీతూకిరణ్, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ పాల్గొన్నారు.