Postal Ballot: ముగిసిన పోస్టల్ బ్యాలెట్.. ఏపీలో 4.3 లక్షల ఓట్లు
- పోస్టల్ బ్యాలెట్ లో 1.2 లక్షల ఓట్లు సచివాలయ ఉద్యోగులవే
- హోం ఓటింగ్ ఆప్షన్ కింద ఓటు హక్కు వినియోగించుకున్న 28 వేల మంది
- ఎసెన్షియల్ సర్వీస్ కేటగిరీలో 31 వేల మంది ఓటేశారన్న ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్ లో సోమవారం (ఈ నెల 13) జరగనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ముగిసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ముందస్తుగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.3 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్, ఎసెన్షియల్ సర్వీస్ కేటగిరీలో ముందస్తుగా ఓటేశారని ఏపీ ఎన్నికల సంఘం తెలిపింది. 2019 ఎన్నికలతో పోలిస్తే ముందస్తు ఓటింగ్ 3.5 రెట్లు ఎక్కువగా నమోదైందని పేర్కొంది.
ముందస్తుగా ఓటేసిన వాళ్లలో 1.2 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు, 2 లక్షల ఇతర ప్రభుత్వ ఉద్యోగులు 40000 మంది పోలీసు అధికారులు కాగా హోం ఓటింగ్ 28000, ఎసెన్షియల్ సర్వీస్ కేటగిరీ కింద 31000 మంది పోస్టల్ బ్యాలెట్ ఆప్షన్ ను వినియోగించుకున్నారు.