KTR: పదేళ్ల నిజం కేసీఆర్ పాలన.. పదేళ్ల విషం నరేంద్ర మోదీ పాలన: కేటీఆర్
- గత పదేళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్న కేటీఆర్
- కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీల హామీ నెరవేర్చిందా? అంటూ నిలదీసిన బీఆర్ఎస్ నేత
- కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ చేసిందేమీ లేదంటూ విమర్శ
- ప్రజల తరఫున పార్లమెంటులో గళం విప్పిన నాయకుడు వినోద్ కుమార్ అని వ్యాఖ్య
- పోరాడే వ్యక్తులే పార్లమెంటుకు వెళ్లాలన్న కేటీఆర్
పదేళ్ల నిజం కేసీఆర్ పాలన, పదేళ్ల విషం బీజేపీ పాలన.. 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన మధ్య పోటీ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. గత పదేళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ఆయన నిలదీశారు. ఐదేళ్లలో బండి సంజయ్ గల్లీలో, ఢిల్లీలో ఎక్కడైనా కనిపించారా? కరీంనగర్ అభివృద్ధికి కేంద్ర నిధులు తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజల తరఫున పార్లమెంటులో గళం విప్పిన నాయకుడు వినోద్ కుమార్ అని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్‌కు మద్దతుగా హుజూరాబాద్‌లో కేటీఆర్ నిర్వహించిన రోడ్ షోలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంకా కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ అగ్రనేత అమిత్‌షా చెప్పులు మోయడం తప్ప సంజయ్ ఒక్కపనైనా చేశారా? అని ఎద్దేవా చేశారు. కేంద్ర నిధులు రాబట్టే సత్తా వినోద్‌కు ఉందన్నారు. కేసీఆర్ పాలన ఎలా ఉంది.. కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ప్రజలు గమనించాలని కోరారు. ప్రలోభాలకు ప్రజలు లొంగవద్దని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీల హామీ నెరవేర్చిందా? అని ప్రశ్నించారు.
రూ. 500 బోనస్ ఇస్తామన్న రేవంత్ హామీ ఏమైంది? అని ఆయన నిలదీశారు. రూ. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా.. తులం బంగారం వచ్చిందా అని అడిగారు. మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామన్న హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న సవతి తల్లిపై పోరాటం చేయాలని, అలా పోరాడే వ్యక్తులే పార్లమెంటుకు వెళ్లాలని కేటీఆర్ అన్నారు.
వినోద్ కుమార్ మాట్లాడుతూ.. పార్లమెంటులో బీఆర్‌ఎస్ ఎంపీలు ఉంటేనే తెలంగాణకు రక్ష అని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. మోదీతో కలిసి చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు హైదరాబాద్‌పై కుట్రలు చేస్తున్నారని తెలిపారు. దక్షిణ కాశీ వేములవాడ ఆలయ అభివృద్ధికి మోదీ ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. తెలంగాణ సమస్యలపై కేంద్రంతో మాట్లాడని ఎంపీ బండి సంజయ్ మనకు అవసరమా? అని కేటీఆర్ ప్రశ్నించారు.