Chandrababu: రాత్రి వేళ తలుపు కొడితే దొంగలు వచ్చారేమో అనుకున్నా... కానీ...!: చంద్రబాబు
- ఏపీలో ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు
- నంద్యాలలో టీడీపీ ప్రజాగళం సభ
- గతేడాది తనను నంద్యాలలో అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు
- తనను చంపాలని ప్రయత్నించారని ఆగ్రహం
- తనను చంపితే ఎవడి మెడకు వాడు ఉరేసుకుని చావాల్సిందేనని వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నంద్యాల ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, నంద్యాల వస్తే తనకు సెప్టెంబరు 9వ తేదీ గుర్తుకు వస్తుందని అన్నారు. ఆ రోజు నంద్యాలలో మీటింగ్ పెట్టానని, రాత్రికి ఇక్కడే ఉండి తెల్లవారితే హైదరాబాద్ వెళ్లాలనుకున్నానని తెలిపారు. అందుకే రాత్రికి ఇక్కడే బస చేశానని వెల్లడించారు.
"ఆ రాత్రి వేళ పోలీసులు వచ్చి మా బస్ తలుపు కొట్టారు. నేను దొంగలు వచ్చారేమో అనుకున్నా. వచ్చింది దొంగలు కాదు... దొంగ పోలీసులు! మా వాళ్లంతా తర్జన భర్జన పడ్డారు. తెల్లవారు జామున కిందికి వచ్చి... ఎందుకయ్యా వచ్చారు అని అడిగాను. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్నారు. అరే... నేను మాజీ ముఖ్యమంత్రిని, ఎక్కడికీ పారిపోను... నన్ను అరెస్ట్ చేయాలంటే కారణం ఉండాలి కదా అని అడిగాను. నోటీసులు ఏవి అని అన్నాను.
ఏది అడిగినా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటున్నారే తప్ప ఇంకేమీ మాట్లాడడంలేదు. ఎఫ్ఐఆర్ ఏదన్నాను. మేం అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు ఇస్తాం, సాయంత్రం ఇస్తాం అని చెప్పడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నన్ను ఇక్కడ అరెస్ట్ చేసి నేరుగా అమరావతి తీసుకెళ్లారు. ఇది అన్యాయమా, కాదా? నాపై వచ్చిన ఆరోపణలే ఏంటో చెప్పకుండా అరెస్ట్ చేయడం తప్పా, కాదా?
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు విపక్ష నేతగా పనిచేసిన వ్యక్తిని, 30 ఏళ్లుగా పార్టీ నడిపిన వ్యక్తిని, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తిని... నన్నే మామూలుగా అరెస్ట్ చేశారంటే... ఈ సైకోకి మీరొక లెక్కా? ఐదేళ్లుగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.
ఈ రోజు సాయంత్రంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. అన్ని సభలు ముగుస్తాయి. ఎల్లుండి జగన్ ను వదిలించుకునే రోజు, సైకోను ఇంటికి పంపించే రోజు.... ప్రజలంతా సిద్ధమా?
నా మీద కేసులు పెడితేనో, అరెస్ట్ చేస్తేనో భయపడతానా నేను? జైల్లో నన్ను చంపేస్తామంటే భయపడతానా? నన్ను చంపితే వీళ్లంతా ఎవడి మెడకు వాడు ఉరేసుకుని చావాల్సి వస్తుంది. నేను ప్రాణాన్ని లెక్కచేయను. తిరుపతి దగ్గర నామీద 23 క్లేమోర్ మైన్లు పేల్చితే ఆ రోజు వెంకటేశ్వరస్వామే వచ్చి నన్ను కాపాడాడు. అలాంటిది ఈ సైకోకి నేను భయపడతానా?
నా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుజాతి కోసం పనిచేస్తా, మీ బిడ్డల కోసం పనిచేస్తా, పేదల కోసం పనిచేస్తా... అందులో ఏమాత్రం రాజీ లేదు. నాదొక బ్రాండు... ఇవాళ హైదరాబాద్ వెళితే అడుగడుగునా ఎవరి ముద్ర కనిపిస్తుంది? హైదరాబాద్ అభివృద్ధికి ఎవరు కారణం? మన ఐటీ నిపుణులు ప్రపంచమంతా వెళ్లి ఆదాయం పొందుతున్నారంటే ఎవరు కారణం? ఇవాళ హైవేలు వచ్చాయంటే... ఆ రోజు ప్రధాని వాజ్ పేయిని ఒప్పించి అద్దంలాంటి రోడ్లు వేయించడమే కారణం.
ఇప్పుడు మీరు నా మీటింగ్ ను సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్నారంటే, ఆ సెల్ ఫోన్లు రావడానికి నేనే కారణం. ఆ రోజున ఏ రాజకీయ నాయకుడైనా సెల్ ఫోన్ గురించి మాట్లాడాడా? నిన్న సైకో చెబుతున్నాడు... ఆయనకు ఫోనే లేదంట... ఆయనకు అడ్రస్సే లేదంట... జైలే తన అడ్రస్ అంట! అలాంటి వాడు మిమ్మల్ని గట్టెక్కిస్తాడా?
2014లో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఎన్ని చెప్పినా వినకుండా కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుంది. దాంతో ఉన్నపళంగా మనం ఇక్కడికి వచ్చేయాల్సి వచ్చింది. విడిపోయిన రాష్ట్రాన్ని బాగు పరిచేందుకు ప్రణాళికలు తయారు చేశాను. అమరావతికి ప్లాన్ చేశాను... హైదరాబాద్ కు దీటుగా రాజధాని నిర్మించాలనుకున్నాను. ఇప్పుడు అమరావతి రాజధాని ఉందా?
మూడు ముక్కల తిక్కలోడు మూడు రాజధానులు చేసేశాడంట! కర్నూలు రాజధాని అయిపోయిందంట, విశాఖ రాజధానిగా అయిపోయిందంట... మీ రాజధాని ఏదంటే సమాధానం చెప్పే పరిస్థితి!
ఇంకో మాట కూడా చెబుతున్నాడు... విశాఖపట్నంలో ప్రమాణస్వీకారం చేస్తాడట... కాదు, ఇడుపులపాయలో చెయ్... మీ నాన్న సమాధి పక్కనే చెయ్! ఈ సైకో కోసం నంద్యాల నుంచి విశాఖ వెళ్లాలంట!
చెల్లెలి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ఇలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూశామా? చెల్లెలు కట్టుకునే చీర గురించి మాట్లాడతాడు. చెల్లెలి పుట్టుకను ప్రశ్నిస్తున్నారు... తల్లి శీలాన్ని కూడ రాజకీయాలకు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారంటే ఏమనాలి? తర్వాత ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడతారు. తల్లిని ఉపయోగించుకున్నాడు, గౌరవాధ్యక్షురాలిగా చేశాడు... ఇప్పుడెక్కడుందా తల్లి? తల్లిని చూడని వాడు నిన్నూ, నన్నూ చూస్తాడా? బాబాయ్ ని చంపినవాడు ఎవర్నయినా లెక్క చేస్తాడా?
ఇవాళ చిలకలూరిపేటలో చెబుతున్నాడు... ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తాయట, జగన్ కు ఓటేస్తే పథకాల కొనసాగింపు, లేకపోతే పథకాలకు ముగింపేనట! నేనొస్తే పథకాలు ఉండవంట!
నేను ఎప్పుడూ పేదల పక్షానే ఉంటాను, సంక్షేమం ఉంటుంది. నేను చేసిన అభివృద్ధి వల్ల నువ్వు బటన్లు నొక్కావు. ఇప్పుడు నువ్వు చేసిన అభివృద్ధి వల్ల బటన్ ఆగిపోయింది. బటన్ నొక్కే పరిస్థితిలో లేడు, అప్పులు తెచ్చే పరిస్థితిలో ఉన్నాడు. జనవరిలో డీబీటీకి బటన్ నొక్కితే మే నెలలో కూడా డబ్బులు రాలేదు. దొంగాటలు ఆడే ఈ దొంగ మాట్లాడుతున్నాడు... బటన్ నొక్కాడంట, డబ్బులు ఇవ్వలేదంట, ఇప్పుడిస్తాడంట! 99 శాతం హామీలన్నీ పూర్తి చేశాడంట... చేశాడా? మీ జీవితాల్లో మార్పు వచ్చిందా?
అక్కచెల్లెమ్మలకు ఇళ్లు కట్టాడంట... అబ్బ, ఏం కట్టాడో ఆ ఇళ్లు! మీరందరూ ఆ ప్యాలెస్ లలోనే కదా ఉంటున్నారు! ప్యాలెస్ లలో ఉండే అలవాటున్న జగన్ మీకు కూడా ఒక ప్యాలెస్ కట్టించాడు. ఇతడు ఎలాంటి పిచ్చివాడంటే, ఇంకా ఊహాగానాల్లోనే ఉన్నాడు.
కానీ నేను కట్టించిన టిడ్కో ఇళ్లు మీకు ఇచ్చి ఉంటే మీకొక ఆస్తి తయారయ్యేది. దాన్ని చెడగొట్టిన వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి. చంద్రబాబును నమ్మొద్దంటాడు... ఆయనను నమ్మాలంట! అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు మాదిరిగా నా మీద చెబుతూనే ఉంటాడు. భవిష్యత్తులో ఏం చేస్తాడో చెప్పలేని దమ్ములేని వ్యక్తి ఇతడు" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.