Mothkupalli Narsimhulu: దేవుళ్లపై ఒట్లు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి: మోత్కుపల్లి నర్సింహులు విమర్శలు

Mothkupalli Narsimhulu allegations on Revanth Reddy

  • రేవంత్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందన్న మోత్కుపల్లి
  • రేవంత్ రెడ్డి దొర అని విమర్శలు
  • రంజిత్ రెడ్డిని తిట్టి మళ్ళీ పార్టీలోకి చేర్చుకున్నారని ఆగ్రహం
  • వంద రోజుల్లోనే రేవంత్ రెడ్డి నైజం బయటపడిందని వ్యాఖ్య

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి దొర అని... ఆయనకు ఎప్పుడూ పైరవీకార్లు, డబ్బున్నవాళ్లే కావాలన్నారు. కోడిగుడ్లు అమ్ముకునేటోడు, బోడగుండు అని రంజిత్ రెడ్డిని తిట్టి మళ్లీ పార్టీలోకి ఈ దొర చేర్చుకున్నాడని ఎద్దేవా చేశారు. వంద రోజుల్లోనే రేవంత్ రెడ్డి నైజం బయటపడిందన్నారు.

రేవంత్‌ తీరుతో మాదిగలు యాభై ఏళ్ళు వెనక్కి పోయారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఏడు స్థానాలు రెడ్డిలకే ఇచ్చారని, బలహీనవర్గాల నేతలు పార్లమెంటుకు పోవద్దా? అని ప్రశ్నించారు. బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చారో చెప్పాలన్నారు. రెడ్డి రాజ్యాన్ని స్థాపించడమే రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ మాదిగలకు రెండు టికెట్లు ఇస్తే... కాంగ్రెస్ ఒక్క టిక్కెట్ ఇవ్వలేదన్నారు. ఇక్కడ ఉన్నది సోనియా కాంగ్రెస్‌ కాదని.. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ అన్నారు.

రియల్ ఎస్టేట్ బ్రోకర్ రేవంత్ రెడ్డి అని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు. దేవుళ్లపై ఒట్లు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. దళితబంధు పేరిట కేసీఆర్ రూ.10 లక్షలిస్తే.. మేం రూ.12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని.... కానీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు అమలవ్వడం లేదన్నారు. మాదిగలు, బలహీనవర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దని పిలుపునిచ్చారు.

కడియం శ్రీహరి కులం ఏమిటో తెలియదని మండిపడ్డారు. 'శ్రీహరీ నీకు సిగ్గుందా.. కేసీఆర్‌ను మోసం చేసి పోతవా' అని ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నో పదవులు ఇచ్చారని... ఏమీ తక్కువ చేయలేదన్నారు. శ్రీహరి కూతురుకు వరంగల్ లోక్ సభ టిక్కెట్ ఇచ్చినా వెళ్లిపోయారని మండిపడ్డారు. అసలు ఆయన మాల కాదు... మాదిగ కాదు... వాళ్ల నోటి కాడా ముద్ద లాక్కుంటున్నాడని విమర్శించారు. ఆయనపై విచారణ చేయాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన్ని సంకన ఎక్కించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News