Andhra Pradesh: ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో ముందే ముగియనున్న పోలింగ్
- ఏపీలో మే 13న ఎన్నికలు
- నేటి సాయంత్రంతో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఏపీలో 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్
- మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
- మరో మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ముగియనున్న పోలింగ్
ఏపీలో నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి హోరెత్తించిన మైకులు ఈ సాయంత్రం 6 గంటల తర్వాత మూగబోయాయి. ఏపీలో మే 13న 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
అయితే రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ముందే పోలింగ్ ముగియనుంది. ఎల్లుండి 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
పాలకొండ, కురుపాం, సాలూరు వంటి ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
మే 13న దేశవ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో అన్ని దశల పోలింగ్ ముగిశాక... జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారన్న సంగతి తెలిసిందే.
చివరిదైన ఏడో దశ పోలింగ్ జూన్ 1న నిర్వహించనున్నారు. ఎల్లుండి జరిగేవి నాలుగో దశ ఎన్నికలు. 10 రాష్ట్రాల్లోని 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు చేపట్టనున్నారు. నాలుగో విడతలో ఏపీతో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.