Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్.. కెప్టెన్ రిషబ్ పంత్ పై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు

IPL Big blow for Delhi Capitals skipper Rishabh Pant suspended for one match
  • మ్యాచ్ ఫీజులో రూ. 30 లక్షల జరిమానా
  • రాజస్థాన్‌ రాయల్స్ తో స్లో ఓవర్ రేటు ఫలితం
  • ఈ సీజన్ లో మూడోసారి అదే నేరం పునరావృతం కావడంతో శిక్ష
  • నేడు ఆర్సీబీతో మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవహరించనున్న అక్షర్ పటేల్
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ దశకు అర్హత సాధించేందుకు తహతహలాడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్ తగిలింది. డీసీ జట్టు సారథి రిషబ్ పంత్ పై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసింది.

ఈ సీజన్ లో డీసీ మూడోసారి స్లో ఓవర్ రేటు (మందకొడి బౌలింగ్)కు కారణమైనందుకు నిబంధనల ప్రకారం పంత్ పై ఈ చర్య చేపట్టింది. అలాగే రూ. 30 లక్షల జరిమానా విధించింది.

ఇంపాక్ట్ ప్లేయర్ సహా జట్టులోని మిగతా సభ్యులకు రూ. 12 లక్షల చొప్పున లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతంలో ఏది తక్కువైతే దాన్ని ఫైన్ కింద పరిగణిస్తామని గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది.

మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్ని డీసీ జట్టు వెంటనే బీసీసీఐ అంబుడ్స్ మన్ లో సవాల్ చేసినా ఫలితం లేకపోయింది. రిఫరీ నిర్ణయాన్ని అంబుడ్స్ మన్ సమర్థించింది. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగే కీలక మ్యాచ్ కు పంత్ దూరం కానున్నాడు. అతని స్థానంలో అక్షర్ పటేల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని జట్టు కోచ్ రికీ పాంటింగ్ తెలిపాడు.

గత మంగళవారం రాజస్థాన్‌ రాయల్స్ తో మ్యాచ్ లో డీసీ తొలుత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ 20 బంతుల్లో 50 చేయగా అభిషేక్ పోరెల్ 36 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. ట్రిస్టన్ స్టబ్స్ 20 బంతుల్లోనే 41 పరుగులు బాదాడు. 

అనంతరం చేజింగ్ కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్ ఓపెనర్లను త్వరగానే కోల్పోయింది. కానీ కెప్టెన్ సంజూ శాంసన్ 46 బంతుల్లో 86 నాటౌట్, రియాన్ పరాగ్ 27 పరుగులు, శివం దూబే 12 బంతుల్లో 25 పరుగులతో గెలుపుపై ఆశలు రేపారు. కానీ సంజూ శాంసన్ అవుట్ కావడం మ్యాచ్ ను అనూహ్యంగా మలుపు తిప్పింది. దీంతో రాజస్థాన్‌ చివరకు 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రవిచంద్రన్ అశ్విన్ 24 పరుగులకు 3 వికెట్లు తీసుకొని మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.


Delhi Capitals
rishab pant
captain
fined
IPL 2024

More Telugu News