Rain: తెలంగాణలో వాన బీభత్సం... తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
- నేడు కూడా తెలంగాణలో వర్షాలు
- పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు
- మెదక్ జిల్లాలో పిడుగుపాటుకు తాతామనవడు మృతి
- కొన్ని చోట్ల తడిసిపోయిన ధాన్యం
- తెలంగాణకు మరో ఐదు రోజుల పాటు వర్ష సూచన
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్ష బీభత్సం నెలకొంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో గాలివానతో తీవ్ర నష్టం చోటుచేసుకుంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, భారీ వర్షం అతలాకుతలం చేశాయి. గాలులకు టార్పాలిన్ పట్టలు లేచిపోగా, భారీ వర్షానికి ధాన్యం తడిసిపోయింది.
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలి రామోజీపల్లి శివారులో వరిధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలో పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. శ్రీరాములు, శివరాజు తాతామనవడు అని తెలుస్తోంది. అటు, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మలోనూ పిడుగు పడింది. ఐదుగురికి గాయాలు కాగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను రిమ్స్ కు తరలించారు.
ఆసిఫాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద సిబ్బంది ఇబ్బందిపడ్డారు.
కాగా, తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది.
వర్షాలకు ధాన్యం తడిసిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన
తెలంగాణలోని పలు జిల్లాల్లో కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుండడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోతే రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.
మెదక్ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందడంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. తెలంగాణకు మరో ఐదు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నందున జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.