YSRCP: ఈసీని కలిసిన వైసీపీ నేతలు... చంద్రబాబు, ఈనాడు, ఆర్ టీవీపై ఫిర్యాదు
- ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో ఈసీని కలిసిన వైసీపీ నేతలు
- చంద్రబాబు చిత్తూరు, నంద్యాల సభల్లో సీఎం జగన్ పై వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
- అప్రజాస్వామిక పదజాలం వాడారని వెల్లడి
- ఆర్ టీవీలో ప్రశాంత్ కిశోర్ ఇంటర్వ్యూ వేశారని వివరణ
- ఈనాడు సీఎం జగన్ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చేలా రాస్తోందని ఫిర్యాదు
టీడీపీ అధినేత చంద్రబాబు, ఈనాడు, ఆర్ టీవీ చానల్ పై వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో వైసీపీ నేతల బృందం ఇవాళ ఈసీని కలిసింది.
ఇటీవల చిత్తూరు, నంద్యాల సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, అప్రజాస్వామిక రీతిలో మాట్లాడారని వారు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కోడ్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు, ఆర్ టీవీ న్యూస్ చానల్ ప్రశాంత్ కిశోర్ ఇంటర్వ్యూతో కోడ్ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించారు. ఈనాడు పత్రికలో సీఎం జగన్ వ్యక్తిగత ప్రతిష్ఠకు మచ్చ తెచ్చేలా రాస్తున్నారని తెలిపారు.
కాగా, తాము ఇప్పటివరకు ఎన్నికల సంఘానికి 230 ఫిర్యాదులు చేసినా, సరిగా స్పందించడంలేదని మల్లాది విష్ణు అసహనం వ్యక్తం చేశారు. కానీ కూటమి ఫిర్యాదులపై మాత్రం ఈసీ వెంటనే స్పందిస్తోందని అన్నారు. ఎన్నికల సంఘం చర్యలు తప్పించుకోవడానికే చంద్రబాబు బీజేపీతో జట్టు కట్టారని విష్ణు ఆరోపించారు.