EVM Snags: ఏపీలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు
- అన్నమయ్య జిల్లాలో ఈవీఎంల ధ్వంసం
- మంగళగిరి నియోజకవర్గంలో పలు బూత్ లలో పోలింగ్ ఆలస్యం
- కారంపూడిలో గంటకు పైగా నిలిచిన పోలింగ్
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఏపీలోని పలు పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పలుచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని దలవాయి పోలింగ్ కేంద్రంలో జనసేన ఏజెంట్ రాజారెడ్డిని దుండగులు అపహరించారు. పోలింగ్ కేంద్రం నుంచి ఆయనను బలవంతంగా లాక్కెళ్లారు. పోలింగ్ బూత్ లోని ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది.
మంగళగిరి నియోజకవర్గంలోనూ కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. కొప్పురావుకాలనీ, సీకే హైస్కూల్ లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ నిలిచిపోయింది. దుగ్గిరాల మండలం చుక్కావారి పాలెం, మోరంపూడిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈవీఎంలలో నెలకొన్న సాంకేతిక సమస్యను సరిచేసేందుకు పోలింగ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కారంపూడిలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ గంటకుపైగా నిలిచింది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు.