Chabahar Port: ఛాబహార్ పోర్టు నిర్వహణకు త్వరలో ఇరాన్‌తో భారత్ కాంట్రాక్ట్!
- పదేళ్ల కాంట్రాక్ట్ కుదుర్చుకునేందుకు త్వరలో ఇరాన్ వెళ్లనున్న భారత షిప్పింగ్ శాఖ మంత్రి
- జాతీయ మీడియాలో కథనాలు
- పాక్‌పై ఆధారపడకుండా ఛాబహార్ పోర్టును అభివృద్ధి చేస్తున్న భారత్
భారత్‌కు వాణిజ్య పరంగా అత్యంత ప్రధానమైన ఛాబహార్ పోర్టు నిర్వహణకు కేంద్రం ఇరాన్ ప్రభుత్వంతో త్వరలో 10 ఏళ్ల కాంట్రాక్ట్ కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం భారత నౌకాయాన శాఖ మంత్రి సర్బంద సోనోవాల్ త్వరలో ఇరాన్ వెళ్లనున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. అయితే, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.
గల్ఫ్ ఆఫ్ ఒమాన్ వెంబడి ఇరాన్ ఆగ్నేయ సముద్ర తీరంలో ఉన్న ఛాబహార్ పోర్టును భారత అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసింది. ఇరాన్‌తో పాటు ఆఫ్ఘనిస్థాన్, మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యానికి ఛాబహార్ పోర్టు కీలకంగా మారింది. సరుకు రవాణాకు పాక్‌లోని కరాచీ పోర్టుపై ఆధారపడకుండా భారత్ చాబహార్ పోర్టును అభివృద్ధి చేస్తోంది. అయితే, ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కారణంగా పోర్టు పనులు మందకొడిగా సాగుతున్నాయి.