Swati Maliwal: కేజ్రీవాల్ ఇంట్లో ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి? సీఎం ఇంటి నుంచి పోలీసులకు ఫోన్ కాల్!
- ఎమర్జెన్సీ నెంబర్ కు రెండు కాల్స్ చేసిన ఎంపీ
- సీఎం నివాసంలో కేజ్రీవాల్ పీఏ తనపై దాడి చేశారంటూ ఫిర్యాదు
- పోలీస్ బృందాలు వచ్చే సరికి అక్కడి నుంచి వెళ్లిపోయిన మలివాల్
రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత స్వాతి మలివాల్ పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో దాడి జరిగిందని సమాచారం. ఈమేరకు స్వాతి మలివాల్ తన ఫోన్ నుంచి రెండుసార్లు ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది సీఎం ఇంటికి చేరుకునే సరికే స్వాతి మలివాల్ అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది. సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, తమకు ఫోన్ రావడంతో వెంటనే బయలుదేరి సీఎం ఇంటికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు.
ఎంపీ స్వాతి మలివాల్ ఫోన్ లో చెప్పిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. సీఎం కేజ్రీవాల్ పీఏ వైభవ్ కుమార్ తనపై దాడి చేశాడని, సీఎం నివాసంలోనే ఈ ఘటన జరిగిందని స్వాతి మలివాల్ చెప్పారన్నారు. సీఎం కేజ్రీవాల్ తన పీఏతో దాడి చేయించారని స్వాతి మలివాల్ ఫోన్ లో ఫిర్యాదు చేశారని తెలిపారు. రెండుసార్లు ఫోన్ చేశారని వివరించారు. వెంటనే స్పందించిన పోలీసులు.. ఓ బృందాన్ని సీఎం నివాసానికి పంపించారు. అయితే, అక్కడ స్వాతి మలివాల్ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టామని, ఫోన్ చేసింది ఎంపీ స్వాతి మలివాల్ అవునా? కాదా? అనే విషయంతో పాటు ఆమె ఆరోపణల్లో నిజానిజాలను గుర్తించేందుకు దర్యాఫ్తు చేస్తున్నామని వివరించారు.
స్వాతి మలివాల్ పై దాడి జరిగిందన్న వార్తలపై బీజేపీ ఐటీ వింగ్ నేత అమిత్ మాలవీయ స్పందించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై ఎంపీ స్వాతి మలివాల్ స్పందించలేదనే విషయాన్ని గుర్తుచేశారు. నిజానికి ఆ సమయంలో స్వాతి మలివాల్ ఇండియాలోనే లేదని, చాలా రోజుల పాటు దేశానికి తిరిగి రాలేదని చెప్పారు. కాగా, స్వాతి మలివాల్ పై దాడి జరిగిందనే వార్తలపై ఆప్ వివరణ ఇవ్వాలని బీజేపీ సీనియర్ నేత కపిల్ మిశ్రా డిమాండ్ చేశారు. ఓ మహిళా ఎంపీపై సాక్షాత్తూ సీఎం నివాసంలోనే దాడి జరిగిందనే ఈ వార్త నిజం కాకూదదంటూ దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు.