KTR: ఓటు వేసిన తర్వాత కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- హైదరాబాద్‌లోని నందినగర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్
- ప్రతిఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు
- తెలంగాణ తెచ్చిన పార్టీకి, నాయకునికి ఓటు వేసినట్లు కేటీఆర్ వ్యాఖ్య
తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హైదరాబాద్‌లోని నందినగర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చిన నాయకుడికే తన ఓటు వేసినట్లు చెప్పారు.
రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మన బాధ్యతను సక్రమంగా వినియోగించినప్పుడే ప్రశ్నించే హక్కు ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. ఓటు వేయకుండా తర్వాత నిందిస్తే ఉపయోగం ఉండదన్నారు.
అలాగే మనకు మంచి చేసే నేతలను ఎట్టిపరిస్థితుల్లో విస్మరించవద్దని కోరారు. వారికి మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. కరెంట్ పోకుండా జనరేటర్లు పెట్టి జాగ్రత్తలు తీసుకున్న అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇకపోతే తాను తెలంగాణ తెచ్చిన పార్టీకి, నాయకునికి ఓటు వేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాలను ఎన్నికల సంఘం వెల్లడించింది. తెలంగాణలో 24.31 శాతం, ఏపీలో 23 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది.