BJP: జూన్ 4 లోగా షేర్లు కొనిపెట్టుకోండి.. స్టాక్ మార్కెట్లు భారీగా పెరుగుతాయి.. అమిత్ షా వ్యాఖ్యలు
- స్టాక్ మార్కెట్లు పడిపోతుండటంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందన
- ఎన్నికలకు, స్టాక్ మార్కెట్లకు ముడి పెట్టకూడదని వ్యాఖ్య
- స్థిరమైన ప్రభుత్వం వస్తే మంచి పనితీరు ఉంటుందని వెల్లడి
- తమకు 400కు పైగా ఎంపీ సీట్లు వస్తాయన్న అమిత్ షా
జూన్ 4వ తేదీలోగా స్టాక్ మార్కెట్లో షేర్లు కొనిపెట్టుకోవాలని, ఎందుకంటే ఆ తర్వాత మార్కెట్ బాగా పుంజుకుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి తగిన మెజారిటీ రాదన్న అంచనాలతోనే స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయన్న ప్రచారంపై ఆయన ఈ విధంగా స్పందించారు. జాతీయ మీడియా సంస్థ ఎన్డీ టీవీకి సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక అంశాలపై మాట్లాడారు.
మార్కెట్లు భారీగా పెరుగుతాయి..
స్టాక్ మార్కెట్ల పతనంపై అమిత్ షా స్పందిస్తూ.. ‘‘నిజానికి స్టాక్ మార్కెట్లు పడిపోవడానికి ఎన్నికలకు ముడిపెట్టవద్దు. ఇంతకు ముందు 16 సార్లు మార్కెట్లు భారీగా కరెక్షన్లకు గురయ్యాయి. ఇప్పుడు బీజేపీకి సీట్లు తగ్గుతాయన్న వదంతులు ఎన్ని వ్యాప్తి చెందినా సరే.. నేను సూచిస్తున్నది ఏమిటంటే.. జూన్ 4వ తేదీలోగా స్టాక్ మార్కెట్లో షేర్లు కొని పెట్టుకోండి. స్టాక్ మార్కెట్లు భారీగా పెరుగుతాయి..” అని పేర్కొన్నారు.
స్థిరమైన ప్రభుత్వం వస్తుంది కాబట్టే..
స్టాక్ మార్కెట్లకు ఎన్నికలకు సంబంధం లేకున్నా.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే మంచి పనితీరు ఉంటుందని అమిత్ షా చెప్పారు. ‘‘మాకు 400కు పైగా ఎంపీ సీట్లు వస్తాయి. స్థిరమైన మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. దీనితో షేర్ మార్కెట్ కూడా పెరుగుతుంది..” అని పేర్కొన్నారు. బీజేపీ, దాని మిత్ర పక్షాలు భారీగా సీట్లు సాధించడం ఖాయమన్నారు.