Madhavi Latha: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు... ఇదిగో వీడియో
- మాధవీలతపై కేసు నమోదు చేసిన మలక్‌పేట పోలీసులు
- పోలింగ్ బూత్‌లోకి వచ్చి బుర్ఖా వేసుకున్న మహిళల ఐడీ ప్రూఫ్ చెక్ చేసిన మాధవీలత
- హిజాబ్ తొలగించి చూపించాలని కొంతమందిని కోరిన మాధవీలత
హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై కేసు నమోదయింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదయింది. మాధవీలత పోలింగ్ బూత్‌లోకి వచ్చి బుర్ఖా వేసుకున్న మహిళల ఐడీ ప్రూఫ్ చెక్ చేశారు. హిజాబ్ తొలగించాలని చెప్పి వారి ఐడీలను ఆమె చెక్ చేశారు. దీంతో ఆమె అనుచితంగా ప్రవర్తించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
మాధవీలత పోలింగ్ బూత్‌లోకి వెళ్లి అక్కడ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న మహిళల ఐడీ కార్డులను అడిగి తీసుకున్నారు. కొంతమందిని హిజాబ్ తొలగించమని కోరారు. హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని హిందువుల ఓట్లు తొలగించారని కూడా ఆమె ఆరోపించారు. ఐడీ కార్డులు సరిగ్గా చూసిన తర్వాతే ఓటింగ్‌కు అనుమతించాలని కోరారు.