Director Harish Shankar: ఎవరో బటన్ నొక్కితే బతికే ఖర్మ మనకు లేదు: సినీ డైరెక్టర్ హరీశ్ శంకర్
- రాజకీయాల్లోకి వచ్చి సంపాదించిన వాళ్లు నాయకులు కాదన్న హరీశ్
- మన బటన్ మనమే నొక్కాలని వ్యాఖ్య
- ఓటు వేయడం మన బాధ్యత అన్న హరీశ్
ఈరోజు ఏపీలో అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఏపీలోని సొంత ఊళ్లకు వెళ్లారు. ఈ ఉదయం కూడా ఎంతో మంది ఊళ్లకు పయనమయ్యారు. విదేశాల నుంచి కూడా ఎంతో మంది వచ్చి వాళ్ల ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు హరీశ్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బటన్ రాజకీయాల గురించి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాజకీయాల్లోకి వచ్చి సంపాదించిన వాళ్లు నాయకులు కాదని ఆయన అన్నారు. వేరే రంగంలో సంపాదించి, రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం ఖర్చు పెట్టిన వాళ్లు మంచి నాయకులని... అలాంటి వాళ్లను గుర్తించాలని చెప్పారు. ఎవరో బటన్ నొక్కితే బతికే ఖర్మ మనకు లేదని... మన బటన్ మనమే నొక్కాలని అన్నారు. ఈరోజు ఆ బటన్ ఈవీఎం బటన్ కావాలని చెప్పారు. ఓటు వేయడం కేవలం మన హక్కే కాదని... మన బాధ్యత కూడా అని అన్నారు.
హరీశ్ శంకర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసేనాని పవన్ కల్యాణ్ కు హరీశ్ పెద్ద అభిమాని అనే సంగతి తెలిసిందే. పవన్ కు ఇష్టమైన వ్యక్తుల్లో హరీశ్ ఒకరు.