Devineni Uma: జగన్ ఈ రెండు గంటల్లో ఆఖరి పోరాటం చేస్తున్నాడు: దేవినేని ఉమా

Devineni Uma warns bureaucrats and YCP leaders

  • ఏపీలో నేడు పోలింగ్
  • పలు చోట్ల ఉద్రిక్తతలు
  • అధికార, విపక్ష వర్గాల మధ్య ఘర్షణలు
  • అధికార పార్టీకి కొమ్ము కాసే అధికారులు మూల్యం చెల్లించుకుంటారన్న ఉమా 

ఇవాళ పోలింగ్ సందర్భంగా వైసీపీ మూకలు తీవ్ర అరాచకాలకు పాల్పడుతున్నాయని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ధ్వజమెత్తారు. 

ఉమా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ఈ ఉదయం పోలింగ్ ప్రారంభం కాకముందే బూత్ ఏజెంట్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ విషయాన్ని సీఈవో దృష్టికి తీసుకెళ్లామని, బాధ్యులైన ఎస్సై సస్పెండ్ అవుతారని సీఈవో స్పష్టం చేశారని వెల్లడించారు. కాబట్టి అధికారులు జాగ్రత్తగా ఉండాలని... పోటీ చేసే అధికార పార్టీ అభ్యర్థుల మాట విని, వాళ్లు చేసే గూండాయిజానికి మద్దతుగా నిలిస్తే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉమా ఉద్ఘాటించారు.

పెద్దిరెడ్డి మాటలు విన్నందుకు ఎస్సై సస్పెండ్ అవుతున్నాడని, అదే విధంగా తాడేపల్లి ఆలోచనలకు అనుగుణంగా సాయంత్రం వరకు బూత్ వద్ద అధికార పార్టీ అభ్యర్థులు చేసే పనులకు అధికారులు సహకరించవద్దని కోరుతున్నామని ఉమా స్పష్టం చేశారు. ఇవాళ తెనాలిలో ఎమ్మెల్యే శివకుమార్ వ్యవహారం అందరూ చూశారని, ఆ చెంపదెబ్బ తాడేపల్లి కొంప మీద కొట్టినట్టే, వైసీపీ గూండాయిజం మీద కొట్టినట్టేనని అన్నారు. 

"క్యూలైన్ లో రాకుండా, పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేని సాఫ్ట్ వేర్ ఉద్యోగి అడ్డుకోవడమే కాదు, తనను ఎమ్మెల్యే కొడితే, ఆ వ్యక్తి కూడా అక్కడికక్కడే  సమాధానం చెప్పాడు. ఇవాళ ఉదయం నుంచి జరిగిన ఘటనలు చూడండి. 

దర్శిలో టీడీపీ నుంచి గొట్టిపాటి లక్ష్మి పోటీ చేస్తోంది. వాళ్ల కుటుంబం అంతా డాక్టర్లే. ఆమె తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ప్రత్యర్థులు 155, 156 బూత్ ల్లో ఏజెంట్లను బయటికి పంపించి రిగ్గింగ్ చేస్తున్నారు. ఫిర్యాదు చేస్తుంటే ప్రిసైడింగ్ ఆఫీసర్, రూట్ ఆఫీసర్ తీసుకోవడంలేదు. కొందరు అధికారులు తొత్తుల్లా పనిచేస్తున్నారు. దర్శి, యర్రగొండపాలెం... చాలా ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. 

తాడిపత్రిలో  పెద్దారెడ్డి అరాచకాలు అందరూ చూశారు. దాంతో పెద్దారెడ్డిని గృహనిర్బంధం చేశారు. ఏలూరులో ఎస్సీ పేటకు చెందిన ఓ వ్యక్తి గొంతు కోశారు. మాచర్లలో అయితే చెప్పే పని లేదు... టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డిని బూత్ వద్దకు వెళ్లనివ్వలేదు. మాచర్ల ఎమ్మెల్యే, వాళ్ల తమ్ముడి అరాచకాలు విచ్చలవిడి అయిపోయాయి. 

కందుకూరు నియోజకవర్గం మొగిలిచర్ల నియోజకవర్గంలో పోలింగ్ బూత్ పై రాళ్లు వేశారు. మరోచోట ఎస్పీ ఉన్న కారునే ధ్వంసం చేశారు. కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీలో నెం.71, నెం.77 బూత్ ల్లోకి ఇష్టం వచ్చినట్టు ప్రవేశించి, అర్జున్ అనే టీడీపీ కార్యకర్త తల పగులగొట్టారు. పుట్టపర్తి వద్ద బుక్కపట్నంలో పోలీసుల సమక్షంలో... వీడియో తీస్తే చంపేస్తామని ఈనాడు కంట్రిబ్యూటర్ పై దాడి చేశారు. మీడియాను కూడా టార్గెట్ చేస్తున్నారు. 

జగన్ గత ఎన్నికల్లో ఆఖరి చాన్స్ అని ఓటు అడిగాడు... జగన్ ఇప్పుడీ రెండు గంటల్లో ఆఖరి పోరాటం చేస్తున్నాడు. ఇవాళ దేశ విదేశాల నుంచి, ఖండాంతరాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి... వృద్ధ మహిళల నుంచి చంటిబిడ్డలను ఎత్తుకున్న తల్లులు వరకు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. మండుటెండల్లో కిలోమీటర్ల మేర నిలబడి ఓటేస్తున్నారు. నిర్ణీత సమయానికి క్యూలైన్ లో ఉంటే చాలు... అర్ధరాత్రి అయినా, తెల్లారినా సరే ఓటేసే అవకాశం ఉంటుంది. ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించాలని కోరుతున్నాం.

ఈ పిచ్చోడ్ని మళ్లీ లండన్ పంపించే పరిస్థితి రావాలి. కూటమి 160 అసెంబ్లీ స్థానాలు, 24 ఎంపీ స్థానాల్లో విజయం బాటలో పరుగులు తీస్తోంది. ఈ సాయంత్రం పోలింగ్ పూర్తి కాగానే, జగన్ మందులు తెచ్చుకోవడానికి మళ్లీ లండన్ పోతున్నాడు. ఈ లండన్ పోయే పిచ్చోడ్ని నమ్ముకుని తప్పుచేసే పోలీసు అధికారులు, వైసీపీ నేతలు, వైసీపీ గూండాలు మూల్యం చెల్లించుకుంటారు. తప్పు చేయవద్దని ఎన్డీయే కూటమి తరఫున హెచ్చరిస్తున్నాం" దేవినేని ఉమా స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News