Lagadapati Rajagopal: ఏపీలో ఎవరు గెలుస్తారనే విషయంపై లగడపాటి రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
- 2019 నుంచి సర్వేలు చేయడం లేదన్న లగడపాటి
- ఇప్పుడు రాజకీయాల్లో లేనని వెల్లడి
- విజేత ఎవరనేది జూన్ 4న తెలుస్తుందని వ్యాఖ్య
మాజీ మంత్రి లగడపాటి రాజగోపాల్ కు ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుంది. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయంపై లగడపాటి తన సర్వే ఫలితాలు వెల్లడించేవారు. ఆ ఫలితాలు కొంచెం అటూఇటుగా కచ్చితంగా ఉండటంతో... ఆయన సర్వేలపై ప్రజల్లో ఎంతో ఆసక్తి ఉండేది. అయితే, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సర్వే ఫలితాలు తారుమారయ్యాయి. ఆ తర్వాత ఆయన తన అంచనాలను వెల్లడించడం మానేశారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో లగడపాటి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2019 నుంచి తాను సర్వేలు చేయడం మానేశానని చెప్పారు. గతంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల నాడి ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకునే వాడినని తెలిపారు. ఇప్పుడు రాజకీయాల్లో లేనని... రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదని చెప్పారు.
ఏపీలో ఓటింగ్ బాగా జరుగుతోందని లగడపాటి అన్నారు. మధ్యాహ్నం క్యూలైన్లలో ఓటర్లు తక్కువగా ఉంటారని ఓటు వేయడానికి వచ్చానని... కానీ, ఓటర్లు బారులుతీరి ఉన్నారని చెప్పారు. అత్యంత విలువైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పోలింగ్ నేపథ్యంలో సగం హైదరాబాద్ ఖాళీ అయిపోయిందని చెప్పారు. బస్సులు, రైళ్లు, విమానాలు, కార్లు ఏది దొరికితే దాంట్లో ఏపీకి వస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయాన్ని తాను చెప్పలేనని... విజేత ఎవరనే విషయం జూన్ 4వ తేదీన తెలుస్తుందని చెప్పారు.