Tirupati: తిరుపతి నియోజకవర్గంలో ఉద్రిక్తత... గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు

Tensions rises in Tirupati constituency

  • బ్రాహ్మణకాలువ గ్రామంలో టీడీపీ × వైసీపీ
  • వైసీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేసేందుకు వచ్చారంటూ అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు
  • టీడీపీ కార్యకర్తలపై దాడికి యత్నించిన వైసీపీ వర్గీయులు
  • ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

తిరుపతి నియోజకవర్గం రామచంద్రాపురం బ్రాహ్మణకాలువ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు  ఏర్పడ్డాయి. వైసీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేసేందుకు వచ్చారంటూ టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. 

ఈ క్రమంలో టీడీపీ శ్రేణులపై వైసీపీ వర్గీయులు దాడికి దిగారు. టీడీపీ శ్రేణులు కూడా తిరగబడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం బ్రాహ్మణకాలువలో సీఆర్పీఎఫ్ బలగాల భద్రత మధ్య పోలింగ్ కొనసాగుతోంది. 

ఇక, సత్యసాయి జిల్లాలో రిగ్గింగ్ జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలు రిగ్గింగ్ జరిగినట్టుగా భావిస్తున్న నల్లమాడ మండలం నల్లసింగయ్యగారిపల్లి వెళ్లారు. టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా ఓ పోలింగ్ బూత్ వద్దకు వెళ్లారు. 

టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరరెడ్డిపై వైసీపీ శ్రేణులు దాడులకు ప్రయత్నించాయి. ఇది మా ఎమ్మెల్యే అభ్యర్థి  సొంతూరు... మీరెలా వస్తారు? అంటూ టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, పల్లె రఘునాథరెడ్డి, ఆయన అనుచరులు వైసీపీ శ్రేణుల దాడిని అడ్డుకున్నారు. 

ఈ దశలో భద్రతా సిబ్బంది స్పందించి పల్లె సింధూరరెడ్డి, రఘునాథరెడ్డిలను వైసీపీ వర్గీయుల దాడి నుంచి తప్పించారు. వారిని ఓ వాహనంలో  అక్కడ్నించి పంపించి వేశారు.

  • Loading...

More Telugu News