Telangana: ఓటు వేస్తూ సెల్ఫీ తీసుకున్న ఓటరు... కేసు నమోదు
- జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో ఘటన
- ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు
- 5 గంటల వరకు తెలంగాణలో 61.16 శాతం ఓటింగ్ నమోదు
తెలంగాణలో ఓటు వేస్తూ ఫొటో తీసుకున్న ఓ ఓటరుపై కేసు నమోదయింది. జగిత్యాల జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో జయరాజ్ అనే ఓటరు ఓటు వేస్తూ సెల్ఫీ తీసుకున్నాడు. ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సుద్దపల్లిలో రెండు చేతులు లేని దివ్యాంగుడు అజ్మీరా రవి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఎన్నికల సిబ్బంది అతని కాలి వేలికి సిరా గుర్తు వేశారు. రెండు చేతులు లేకున్నా బాధ్యతతో ఓటు వేయడానికి వచ్చిన రవిని అందరూ అభినందించారు.
5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్
తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదయింది. అత్యధికంగా భువనగిరిలో 72.34 శాతం, అత్యల్పంగా హైదరాబాద్లో 39.1 శాతం పోలింగ్ నమోదయింది. మల్కాజ్గిరిలో 46.27 శాతం, సికింద్రాబాద్లో 42.48 శాతం, జహీరాబాద్లో 71.91 శాతం, మెదక్లో 71.33 శాతం, ఖమ్మంలో 70.76 శాతం ఓటింగ్ నమోదయింది.