Chandrababu: ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చారిత్రాత్మక దినం: చంద్రబాబు
- ఏపీలో పోలింగ్ సరళి పట్ల చంద్రబాబు సంతోషం
- ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన టీడీపీ అధినేత
- ప్రజల సంకల్పం, ఉత్సాహం స్ఫూర్తిదాయకమని వెల్లడి
- రాత్రి వరకు పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోందంటూ ట్వీట్
ఏపీలో పోలింగ్ సరళి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓటరు చైతన్యం వెల్లివిరిసిందని, ఉదయం 7 గంటల నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్ లకు తరలి వచ్చి ఓట్లు వేయడంపై ధన్యవాదాలు తెలుపుతున్నానని వెల్లడించారు.
ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చారిత్రాత్మక దినం అని అభివర్ణించారు. ప్రజల సంకల్పం, వారి ఉత్సాహం స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ఉదయం 7 గంటలకు ఎంత పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద ఉన్నారో, పోలింగ్ ముగిసే సమయంలో కూడా అంతే ఉత్సాహంగా ఓట్లు వేస్తున్నారని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రజలు ఓటింగ్ పై ఇంత ఉత్సాహం ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికి శుభపరిణామం అని పేర్కొన్నారు. ప్రజల చైతన్యం చూస్తుంటే ఈ రాత్రి వరకు కూడా పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
అయితే, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా, ప్రతి బూత్ వద్ద విద్యుత్ సరఫరా సదుపాయం, విద్యుద్దీపాలు ఏర్పాటు చేసే దిశగా ఈసీ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.
గత ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ జరిగిందని, ఈసారి ప్రజలు ఊపు చూస్తుంటే 85 శాతం పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోందని తెలిపారు.